
న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 1వ తేదీ) సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓటర్ల ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించడానికి సీఈసీ విధించిన డెడ్‌లైన్ గడువు సెప్టెంబర్ 1 తేదీని పొడిగించాలంటూ బీహార్ రాజకీయ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన ‘సర్’ నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ‘సర్’ అంశానికి సంబంధించి గందరగోళ పరిస్థితులు చక్కబడాలంటే రాజకీయం పార్టీలు తమను తాము యాక్టివేట్ చేసుకుని సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించింది.
అభ్యర్థనలు, ఫిర్యాదులకు డెడ్‌లైన్ అనేది అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అభ్యర్థనలకు సెప్టెంబర్1 వ తేదీ చివరి తేదీగా ఉన్నప్పటికీ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, దిద్దుబాట్లను దాఖలు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఈసీ నిర్దేశించిన డెడ్‌లైన్ ముగింపు తేదీ తర్వాత కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తమ ఉత్తర్వులో పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా డెడ్‌లైన్ పొడిగింపు తేదీ అంటూ ఏమీ అవసరం లేదని తెలిపింది.
ఫలితంగా అభ్యంతరాలను యథావిధిగా స్వీకరిస్తామని కోర్టుకు ఈసీ హామీ ఇచ్చింది. నామినేషన్ చివరి తేదీ వరకూ కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని సుప్రీంకోర్టుకు సీఈసీ తెలిపింది. అదే సమయంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించాలని బీహార్ లీగల్ సర్వీసెస్ అధారిటీకి కోర్టు ఆదేశించింది. ఓటర్లకు సహాయం చేసే క్రమంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించడమే సరైనదిగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పారా లీగల్ వాలంటీర్లు ఇచ్చే రిపోర్ట్‌ను జిల్లా స్థాయి జడ్జిలు సమీక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులకు ఆధార్‌ను ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా ఉపయోగించవచ్చని, కానీ అది పౌరసత్వం నిర్ధారణకు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా, బీహార్‌లో ‘సర్’ తొలగించిన 65లక్షల ఓట్లతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. దీన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించింది. ఇది ఎన్నికల కమిషన్‌తో కలిసి కేంద్రం చేస్తున్న ఓట్ చోరీ అంశంగా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓట్ అధికార్ యాత్ర పేరుతో ఇప్పటికే బీహార్‌లో రాహుల్ గాంధీ యాత్ర చేశారు. మరొకసారి ఇదే అంశానికి సంబంధించి ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమైంది. నేడు ఓట్ అధికార్ యాత్ర పాట్నాలో ప్రారంభమైంది. ‘సర్’లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, దానిని తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.