నూపుర్‌ శర్మపై ‘సుప్రీం’ తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం.. సీజే ఎన్వీరమణకు లేఖ

SC remarks on Nupur Sharma: Retired Judges Bureaucrats Letter To CJI - Sakshi

ఢిల్లీ: అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్‌ నేత నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. అయితే ఆమెకు మద్దతుగా.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌పైనా సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీలంతా కలిసి బహిరంగ ప్రకటన విడుదల చేయడం, సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

పదిహేను మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు, 77 మంది రిటైర్డ్‌ బ్యూరోక్రాట్స్‌, 25 మంది ఆర్మీ మాజీ అధికారులు ఈ బహిరంగ ప్రకటనలో సంతకం చేశారు.  నూపుర్‌ శర్మ పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని పేర్కొన్నారు. 

తన భద్రత దృష్ట్యా.. దేశంలో తనకు వ్యతిరేకంగా నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ  సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. నూపుర్‌ శర్మ భద్రతకు ముప్పు కాదని.. ఆమె తన వ్యాఖ్యలతో దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ప్రవక్తకు సంబంధించి కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని, ఆమె వ్యాఖ్యలే దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలకు కారణమైందని(ఉదయ్‌పూర్‌ ఘటనను ఉద్దేశించి) బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులు మతం కోసం మాట్లాడినట్లు కాదు. అసలు వీళ్లు ఇతర మతాలను గౌరవించే రకం కూడా కాదు.  నోటి దురుసుతో దేశం మొత్తాన్ని రావణ కాష్టం చేశారని, యావత్‌ జాతికి ఆమె మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు మండిపడింది. 

అయితే సుప్రీం కోర్టు బెంచ్‌లో జస్టిస్‌ సూర్యకాంత్‌.. నూపుర్‌ను ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ఫోరమ్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్‌, జమ్ము అండ్‌ లడఖ్‌ అనే సంస్థ లెటర్‌ను రిలీజ్‌ చేసింది. నూపుర్‌పై తీవ్రవ్యాఖ్యలతో న్యాయమూర్తులు లక్ష్మణరేఖ దాటారు.. తక్షణ దిద్దుబాటు అవసరం అంటూ ఈ మేరకు లేఖను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పంపింది.

చదవండి: న్యాయవాది అని నూపుర్‌ చెప్పుకోవడం సిగ్గుచేటు- నూపుర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top