ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ

retired judges write open letter to CJI  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు నలుగురు మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలతో తాము ఏకీభవిస్తున్నామని ఈ లేఖలో వారు పేర్కొన్నారు. కేసుల కేటాయింపులో సుప్రీం జడ్జీల అభ్యంతరాలు సరైనవేనని, న్యాయవ్యవస్థలో సంక్షోభాన్ని జ్యుడిషియరీ పరిధిలోనే పరిష్కరించుకోవాలని లేఖలో సూచించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పీబీ సావంత్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కే చంద్రు, బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్‌ సురేష్‌.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను మీడియాకు అందచేశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మాజీ న్యాయమూర్తులతో కలిసి భారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశామని జస్టిస్‌ షా ధ్రువీకరించారు. లేఖలో తాము పేర్కొన్న అంశాలు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ సంక్షోభం సమసిపోయేంత వరకూ కీలక కేసులను సీనియర్‌ జడ్జీలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరామన్నారు. ఇక నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు పనితీరు సవ్యంగా లేదంటూ ముందుకు తెచ్చిన అంశాలను ఈ లేఖలో ప్రస్తావించారు.

‘కేసుల కేటాయింపు ముఖ్యంగా సున్నితమైన కేసులను వివిధ సుప్రీం బెంచ్‌లకు కేటాయించడంలో సరైన ప్రామాణికాలు పాటించలేదనే అంశం తీవ్రమైంది.. పద్ధతి ప్రకారం ఆయా బెంచ్‌లకు కేసుల కేటాయింపు జరగడం లేదని, జూనియర్‌ న్యాయమూర్తులున్న బెంచ్‌లకూ కీలక  కేసుల కేటాయింపు పట్ల నలుగురు న్యాయమూర్తులు ఆందోళన సమంజసమే. కేసుల కేటాయింపు సరిగ్గా లేకపోవడం న్యాయ నిర్వహణ, చట్ట నిబంధనలపై ప్రతికూల ప్రభావం చూపుతుంద’ని లేఖలో రిటైర్డ్‌ న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంచ్‌ల మధ్య కేసుల కేటాయింపు, కేసుల పంపిణీ వంటి అంశాల్లో విస్పష్ట నియమ నిబంధలను రూపొందిచడం ద్వారా ఈ సమస్యను అధిగమించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో వారు సూచించారు.

ఇప్పటివరకూ ఏం జరిగినా.. ఇక నుంచీ అన్ని కీలక, సున్నితమైన కేసులను అయిదుగురు సీనియర్‌ జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనమే పర్యవేక్షించాలని పేర్కొంది. ఇలాంటి చర్యలు తీసుకుంటేనే సుప్రీం కోర్టు స్వేచ్ఛగా, సజావుగా పనిచేస్తోందని, కీలక కేసుల్లో ప్రధాన న్యాయమూర్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలకు భరోసా ఉండగలదని స్పష్టం చేసింది. ఈ దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని నలుగురు రిటైర్డ్‌ జడ్జీలు సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top