పినరయి సర్కారు ప్రతిపాదన
నివేదిక కోరిన జాతీయ బీసీ కమిషన్
సెప్టెంబరు 10న పినరయి సర్కారు సమీక్ష
మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు నిర్ణయం
జాతీయ బీసీ కమిషన్‌కు సిఫార్సులు
తాజాగా సర్కారు నివేదిక కోరిన బీసీ కమిషన్
ఆ మేరకు లేఖ పంపిన ఎన్‌సీబీసీ చైర్మన్ హన్స్‌రాజ్ ఆహిర్
రాజ్యాంగ విరుద్ధమంటున్న న్యాయనిపుణులు
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో.. పినరయి విజయన్ సర్కారు ముస్లింలు, క్రైస్తవులకు నేరుగా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించిందా..? ముస్లింలకు 10% .. క్రైస్తవులకు 6% కోటా ఇచ్చేందుకు సిద్ధపడిందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు, క్రైస్తవులకు అవకాశం ఇవ్వాలని పినరయి సర్కారు సెప్టెంబరు 9న జరిగిన ఓ సమీక్షలో నిర్ణయించింది. ముస్లింలకు 10%, క్రిస్టియన్లకు 6% కోటా ఇవ్వాలని సంకల్పించింది.
ఆ సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జాతీయ బీసీ కమిషన్(ఎన్‌సీబీసీ)కు పంపింది. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై పాటించాల్సిన ప్రమానాలను సూచించాల్సిందిగా బీసీ కమిషన్‌ను కోరింది. చట్టంలో పేర్కొన్న ఓబీసీ హక్కుల ప్రకారం ఆయా మతాల్లో కులాలను పేర్కొంటామని వివరించింది.దీనిపై జాతీయ బీసీ కమిషన్ స్పందిస్తూ తాజాగా పినరయి సర్కారుకు ఓ లేఖ పంపింది. 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. రాష్ట్రప్రభుత్వం పంపిన నోట్‌లో పేర్కొన్న ‘రిజర్వేషన్ల ఫలాలు కొందరికే అందుతున్నాయి’ అనే దానిపై సమగ్ర వివరాలు అందించాలని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌సీబీసీ చైర్మన్ హన్స్‌రాజ్ ఆహిర్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు.
అయితే.. సర్కారు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని గుర్తుచేస్తున్నారు. హిందూ మతంలో వెనకబడిన కులాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నట్లు వివరిస్తున్నారు. ఆర్థికంగా వెనకబడి వర్గాలు(ఈడబ్ల్యూఎస్)కు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అందజేస్తున్న 10% రిజర్వేషన్లు కూడా 50% కోటా పరిధిలోకి రావని.. జనరల్ కేటగిరీలో 10శాతాన్ని ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించారని చెబుతున్నారు. అయితే.. కేరళ సర్కారు నిర్ణయం అమలవుతుందా? వివాదాస్పదంగా ముగుస్తుందా? అనేది ఉత్కంఠగా మారుతోంది.


