చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు(వేలుమణి వర్గం) పళనిస్వామితో సమావేశమయ్యారు. పళనిస్వామితో రాజీపడ్డ తిరుగుబాట ఎమ్మెల్యేల వర్గం.. అన్నాడీఎంకేలో చీలిక లేదంటూ ప్రకటించారు. పళనిస్వామికి వేలుమణి బృందం పూర్తి మద్దతు తెలిపింది. పళనిస్వామితో సమావేశం అనంతరం స్పీకర్‌ను కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు(వేలుమణి బృందం) తామంతా పార్టీగా మళ్లీ ఒకటిగా ఉన్నామంటూ స్పష్టం చేశాయి.
తాము ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటామంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. పళనిస్వామి పట్ల తమ విధేయతను చాటుకున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత పళనిస్వామికి వ్యతిరేకంగా సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అన్నాడీఎంకేలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ వర్గం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించగా.. పళనిస్వామి తిరస్కరించారు. అయితే, తిరుగుబాటు వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి మాటను పక్కనబెట్టి.. విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ వ్యవహారం ముదరడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పళనిస్వామి స్పీకర్‌కు లేఖ కూడా రాశారు.
స్పీకర్ కార్యాలయంలో అనర్హత వేటు ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తిరుగుబాటు వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరడంతో ఆ వర్గానికి పెద్ద షాక్ తగిలింది. స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నందున ఈ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈపీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నివాసంలో ఆయన్ను కలిసి సంధి ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం పళనిస్వామి తమ నాయకుడని వారు స్పష్టం చేశారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల వల్లే ఈ తిరుగుబాటు జరిగిందంటూ పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని.. తమ డిమాండ్లను పరిశీలించడానికి పళనిస్వామి అంగీకరించారని నేతలు వెల్లడించారు. తిరుగుబాటుదారులు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగి రావడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తును పళనిస్వామి ఉపసంహరించుకున్నారు.


