డెహ్రాడూన్: పశ్చిమాసియాలో యుద్ధం గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పశ్చిమాసియాలో యుద్ధం గురించి స్పందించారు. ఉత్తరాఖండ్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడారు.
‘చర్చలు, దౌత్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మీకు తెలుసు, ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధం జరుగుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న దాడులు భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికీ ఆందోళనకర విషయం. భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. యుద్ధానికి పరిష్కారం యుద్ధంతో లభించదని మోదీ చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలు చేయాలి. ప్రధాని మోదీ ప్రయత్నానికి దేశ ప్రజలు మద్దతు ఇవ్వాలి’ అని అన్నారు.
కాగా, యుద్ధం ముగింపు గురించి అమెరికా చెబుతున్న మాటలను ఇరాన్ నమ్మడం లేదు. ఇరాన్ ఐఎస్ఎన్ఎ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ దేశ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అమెరికా సైనిక చర్యలు ముగింపు దశకు చేరవచ్చని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తాము నమ్మడం లేదని చెప్పారు.
“ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ నమ్మడం లేదు. అమెరికా సైనిక కార్యకలాపాల్లో మార్పు కనపడడం లేదు. ట్రంప్ చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదు. ఇప్పుడు ట్రంప్‌కు గుణపాఠం నేర్పాలని ఇరాన్ నిర్ణయించింది” అని అన్నారు. కాగా, శుక్రవారం ట్రంప్ ఇరాన్‌లో సైనిక చర్యలను ముగించే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. కానీ, ఆ తర్వాత కాల్పుల విరమణ అమలు చేయాలని అనుకోవడం లేదని తెలిపారు.


