రాజీవ్‌ గాంధీ హంతకులకు దీర్ఘకాలిక పెరోల్‌? 

Rajiv Gandhi Assassination Case Convicts Considers Long Parol - Sakshi

సాక్షి, చెన్నై : రాజీవ్‌ గాంధీ హత్య కేసు నిందితులు దీర్ఘకాలం ఆంక్షలు, షరతులతో జైలు బయట ఉండేందుకు వీలుగా పెరోల్‌ నిబంధనల్లో మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రాజీవ్‌ హత్య కేసులో నిందితులను విడుదల చేయాలని గత మంత్రి వర్గం తీర్మానం చేయడం, దాన్ని గవర్నర్‌ రాష్ట్రపతికి పంపడం తెలిసిందే. తమను విడుదల చేస్తూ చేసిన తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నిందితులు న్యాయ పోరాటం చేశారు. చివరకు బంతి మళ్లీ రాష్ట్రపతి కోర్టులోకి చేరింది.

డీఎంకే రాష్ట్ర పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఎన్నికల వాగ్దానంగా నిందితుల విడుదలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. అయితే చట్టపరమైన చిక్కులు డీఎంకేను కలవరంలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే తన కుమారుడితో సహా మిగిలిన వారిని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని పేరరివాలన్‌ తల్లి అర్బుదమ్మాల్‌ బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ను కలిసి విన్నవించారు. వారి విడుదలకు ఎదురవుతున్న చట్టపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ మేరకు నిందితులు ఎక్కువ కాలం జైలులో కాకుండా షరతులు, నిబంధనలకు అనుగుణంగా తమ కుటుంబంతో కలిసి ఉండేందుకు వీలుగా ఈ మార్గాన్ని ఎంచుకునే పనిలో పడినట్టు సమాచారం.

వీరి కోసమే పెరోల్‌ నిబంధనల్ని మార్పులు చేయడానికి కసరత్తులు సాగుతున్నాయి. నిందితులు ఏడుగురిలో పెరరివాలన్, నళిని, రవిచంద్రన్‌ మాత్రం తమిళనాడుకు చెందిన వారు. మిగిలిన నలుగురు శ్రీలంకకు చెందిన వారు. ఆ ముగ్గురు కుటుంబంతో గడిపేందుకు వీలుగా, మిగిలిన నలుగురిని శ్రీలంకకు పంపించకుండా ఇక్కడి శరణార్థుల శిబిరంలో స్వేచ్ఛాయుత జీవితాన్ని గడిపేందుకు తగినట్టు దీర్ఘ కాలిక పెరోల్‌ కసరత్తు సాగుతుండటం గమనార్హం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top