
జైపూర్: కొన్ని ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి ఉదంతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. ఒక మహిళ తన 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనివ్వడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ బిడ్డ పుట్టకముందే ఆమె పలుమార్లు అమ్మమ్మగా మారడం మరో విశేషం.
లీలావాస్ గ్రామానికి చెందిన కవారా రామ్ భార్య రేఖ(55) రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలోని జాడోల్ బ్లాక్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో తన 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కుటుంబ సభ్యులనే కాకుండా స్థానికులను సైతం ఆశ్చర్యపరిచింది. కవారా,రేఖ దంపతులు ఇప్పటివరకూ మొత్తం 17 మంది పిల్లలను కన్నారు. వీరిలో ఐదుగురు శిశువులు పుట్టిన వెంటనే మరణించారు. ప్రస్తుతం ఈ దంపతులకు 12 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఏడుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.
కవారా తెలిపిన వివరాల ప్రకారం వారి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలకు వివాహం అయ్యింది. ఈ వివాహితుల్లో ఒక్కొక్కరికి ఇద్దరు నుండి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రేఖ.. ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వకముందే పలుమార్లు అమ్మమ్మగా మారింది. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. స్క్రాప్ డీలర్‌గా పనిచేసే కవారా పిల్లల వివాహాల కోసం అప్పులు చేశాడు. మరోవైపు ఈ దంపతుల పిల్లల్లో ఎవరూ పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు.
రేఖ ప్రసవాన్ని పర్యవేక్షించిన డాక్టర్ రోషన్ దరంగి మీడియాతో మాట్లాడుతూ.. రేఖ తన దగ్గరకు వచ్చిన ప్పుడు తొలుత ఇది తన నాల్గవ కాన్పు అని చెప్పిందన్నారు. అయితే ఆ తరువాత, ఆమె ఇప్పటికే 16 మంది పిల్లలకు జన్మనిచ్చిందని, వారిలో ఐదుగురు చనిపోయారని తెలిసిందన్నారు. ఆమెకు గతంలో చాలా ప్రసవాలు జరగడంతో, గర్భాశయం బలహీనపడి అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఏర్పడేది. తల్లి ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. అయితే అదృష్టవశాత్తూ, అటువంటిదేమీ లేకుండానే డెలివరీ జరిగిందని, తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమమేనేని తెలిపారు.