భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏంటంటే? | Shocking Twist Revealed In Raichur Wife And Husband Krishna River Bridge Viral Incident | Sakshi
Sakshi News home page

భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏంటంటే?

Jul 21 2025 10:18 PM | Updated on Jul 22 2025 3:15 PM

raichur wife pushing husband krishna river bridge viral video get big twist

సాక్షి,బెంగళూరు: భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. భార్య మైనర్‌ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.  

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో ఉన్న శక్తినగర్‌కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్‌ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మతో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్‌పై వడిగేరికి వెళ్లి ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గం మధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్‌ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. 

భర్త తన ఫోన్‌ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్‌ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది.

నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచ్చిన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది.

ఈ విషయమై శక్తినగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ బస్వరాజ్‌ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు.

అయితే, ఇదే కేసులో భార్య మైనర్‌ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భర్తను నదిలోకి తోసేసినట్లు భార్య పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. చట్టపరంగా భర్తపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉపక్రమించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement