తెలంగాణ సంస్థకు మళ్లీ కాంట్రాక్టు ఎందుకిచ్చారు?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ ఆన్–స్క్రీన్ మార్కింగ్(ఓఎస్‌ఎం) వ్వవస్థలో అక్రమాలపై స్వతంత్ర జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మొత్తం కుంభకోణంలో నిజాలను బహిర్గతం చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) సైతం నియమించాలని అన్నారు. తెలంగాణలో వివాదాస్పద నేపథ్యం ఉన్న ఒక సంస్థకు సీబీఎస్‌ఈ ఈ ఓఎస్‌ఎం కాంట్రాక్టును అప్పగించిందని ఆరోపించారు. సీబీఎస్‌ఈ తీరు వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని చెప్పారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నోరుమెదపడం లేదని రాహుల్ ధ్వజమెత్తారు.
ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. 12వ తరగతి సీబీఎస్‌ఈ పరీక్షకు సంబంధించి నమ్మశక్యంకాని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేశారు. ఈ పరీక్షకు ఓఎస్‌ఎం చేసిన కోంపెంట్ ఎడ్యుటెక్ అనే కంపెనీ అసలు పేరు గ్లోబరెనా అని తెలిపారు. ఈ గ్లోబరెనా ఇంతకుముందు తెలంగాణలో 2019, 2023లో స్కామ్‌కు పాల్పడిందిన్నారు. తెలంగాణలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ఓఎస్‌ఎం ఆధారిత లోపాలే కారణమని తేల్చిచెప్పారు. మళ్లీ అదే కోంపెంట్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఖండించిన సీబీఎస్‌ఈ
కోంపెంట్ ఎడ్యుటెక్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను సీబీఎస్‌ఈ బుధవారం ఖండించింది. అందులో ఎంతమాత్రం నిజం లేదని పేర్కొంది. ఓఎస్‌ఎం కాంట్రాక్టును కోంపెంట్‌కు ఇచ్చిన మాట నిజమేనని వెల్లడించింది. అయితే, రాహుల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. నిబంధనల ప్రకారమే కాంట్రాక్టును కట్టబెట్టామని తేల్చిచెప్పింది. రాహుల్ ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆక్షేపించింది.


