అమృత్‌పాల్‌కు ఐఎస్‌ఐ లింకులు!

Punjab Police suspects ISI angle, foreign funding as hunt for Amritpal Singh continues - Sakshi

కోట్లాదిగా విదేశీ నిధులు

కొనసాగుతున్న వేట

మామ లొంగుబాటు

చండీగఢ్‌: ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌సింగ్‌ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్‌ సైన్యాన్ని తయారు చేసుకునేందుకు అతడు విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అరెస్టైన అతని ప్రధాన అనుచరుడు దల్జీత్‌ సింగ్‌ బ్యాంకు ఖాతాలకు గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ.35 కోట్లు జమ అయినట్టు తేలింది. పలు మోసపూరిత ఆర్థిక వ్యవహారాల్లోనూ అతను కీలకంగా వ్యవహరించాడు. అంతేగాక వారిస్‌ దే సంస్థకు అనుబంధంగా ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌ (ఏకేఎఫ్‌) ఏర్పాటుకు దల్జీత్‌ ప్రయత్నిస్తున్నట్లు తేలింది.

మరోవైపు అమృత్‌పాల్‌ దుబాయ్‌లో ట్రక్‌ డ్రైవర్‌గా ఉండగా అతనికి ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసులంటున్నారు. ‘‘భారత్‌లో విద్రోహ కార్యకలాపాలు చేపట్టేలా బ్రెయిన్‌ వాష్‌ చేసింది. అతనికి పలువురు డ్రగ్స్‌ పెడ్లర్ల మద్దతుంది. అమృత్‌పాల్‌ వాడే మెర్సిడెజ్‌ కారు రావెల్‌ సింగ్‌ అనే డ్రగ్‌ పెడ్లర్‌దే. రాష్ట్రవ్యాప్తంగా డీ అడిక్షన్‌ సెంటర్లు పెట్టి, అక్కడికొచ్చే వారిని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. ఆ సెంటర్లలో ఆయుధాలు నిల్వ చేస్తున్నాడు. ఐఎస్‌ఐ సాయంతో మతం ముసుగులో పంజాబ్‌ను ప్రత్యేక దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’’ అని చెబుతున్నారు. ఈ కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అమృత్‌పాల్‌ కోసం వేట కొనసాగుతోంది. అతడు కెనడాకు పారిపోయే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అతని మామ హర్జిత్‌ సింగ్‌ సహా ఐదుగురు ఆదివారం అర్ధరాత్రి లొంగిపోయారు. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసులు పెట్టారు.

భారత కాన్సులేట్‌పై దాడి
వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయంపై ఖలిస్తానీ అనుకూలవాదులు ఆదివారం దాడికి తెగబడ్డారు. ఆవరణలో ఖలిస్తానీ జెండాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బ్రిటన్‌లో లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీవాదులు తొలగించిన ఘటనపై కేంద్రం తీవ్ర నిరసన తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top