కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడి
అహ్మదాబాద్: ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఉన్న అసలైన సూత్రధారులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దాడికి పాల్పడేందుకు మరొకరు సాహసించకుండా ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో పలు కార్యక్రమాలను అమిత్ షా గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు.
షెడ్యూల్ ప్రకారం ఆయన ఇక్కడ స్వయంగా పర్యటించాల్సి ఉండగా, ఢిల్లీ పేలుడు నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. వర్చువల్‌గా మాట్లాడారు. ముష్కరులకు కఠిన శిక్ష పడితేనే అది మరొకరికి హెచ్చరిక అవుతుందని అన్నారు. ఢిల్లీ పేలుడు కుట్రదారులకు సాధ్యమైనంత ఎక్కువ కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. వారిని చట్టం ముందు నిలబెట్టే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ఉగ్రవాదంపై పోరాడుతూనే ఉందని గుర్తుచేశారు.


