"రోడ్‌ సేఫ్టీ పై ప్రజల నమ్మకమే ప్రమాదకారకం" | Public belief regarding road safety is itself a danger Recent study reveals | Sakshi
Sakshi News home page

"రోడ్‌ సేఫ్టీ పై ప్రజల నమ్మకమే ప్రమాదకారకం"

Jul 21 2026 10:46 PM | Updated on Jul 21 2026 11:29 PM

Public belief regarding road safety is itself a danger Recent study reveals

రోడ్డు ప్రయాణ భద్రతపై నిర్వహించిన సర్వే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ప్రజలు రోడ్డుప్రయాణాన్ని సురక్షితంగా భావిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రజల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది తమ రోజువారీ రోడ్డు ప్రయాణం సురక్షితంగా ఉందని భావిస్తుండగా,  రవాణా వ్యవస్థల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ నిపుణుల్లో 45% మంది మాత్రమే ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. బ్రెంబో మద్దతుతో ఎకనామిస్ట్‌ ఎంటర్‌ప్రైజ్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం, రోడ్డు భద్రతపై ప్రజల విశ్వాసానికి, నిపుణుల అంచనాలకు మధ్య విశ్వాస అంతరం (కాన్ఫిడెన్స్‌ గ్యాప్‌) ఆందోళనకరంగా ఉందని పేర్కొంది.

‘సేఫ్టీ ఇన్‌ మోషన్‌: డ్రైవింగ్‌ ట్రస్ట్‌ ఇన్‌ మోడర్న్‌ మొబిలిటీ’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం...వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేని ప్రజల విశ్వాసం రోడ్డు భద్రత పురోగతికి ప్రధాన అవరోధాల్లో ఒకటిగా మారుతోందని కూడా స్పష్టం చేసింది.  ప్రజల్లో ఉన్న ఈ విశ్వాస అంతరాన్ని సాక్ష్యాధారాలు, పారదర్శకత, కొలవగల ఫలితాల ఆధారంగా తగ్గించాలని పరిశ్రమలు, విధాన రూపకర్తలకు ఈ అధ్యయనం తెలుపుతోంది.

నమ్మకం కాదు భ్రమ మాత్రమే...
ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 12 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రజల్లో ఈ తరహా నమ్మకం పెరగడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడడం విశేషం. ప్రపంచ వాహన ఉత్పత్తిలో దాదాపు 75% వాటా కలిగిన పది ప్రధాన ఆటోమొబైల్‌ మార్కెట్లైన బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్ జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే), అమెరికా (యూఎస్‌) దేశాల్లోని రోడ్డు వినియోగదారులు, అలాగే రవాణా రంగ నిపుణుల అభిప్రాయాలను సేకరించింది.

‘రవాణా రంగ నిపుణులతో పోలిస్తే,  రోడ్డు ప్రయాణీకులు తమ రోజువారీ ప్రయాణ భద్రతపై ఎక్కువ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ఈ పరిశోధన వెల్లడిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం‘ అని   ఐక్యరాజ్యసమితి కి చెందిన రోడ్డు భద్రత విభాగ సెక్రటరీ జనరల్‌  జీన్‌ టోడ్ట్, అంటున్నారు. విచిత్రం ఏమిటంటే...రోడ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్న చోటే రోడ్డు ప్రయాణీకులు అత్యంత సురక్షితంగా ఉందని భావిస్తున్నారట.  ‘ప్రయాణంలో విశ్వాసం ఎంతో అవసరం. అయితే, మితి మీరిన విశ్వాసం ప్రజలను అనవసరమైన ప్రమాదాలను స్వీకరించేలా ప్రేరేపిస్తుంది‘ అని జీన్‌ టోడ్ట్, అభిప్రాయపడ్డారు.

మన దేశంలోనూ మితిమీరిన విశ్వాసం...
రోడ్డు మీద ప్రయాణించేవారు, రవాణా రంగ నిపుణుల అభిప్రాయాల మధ్య అత్యధిక విశ్వాస అంతరం బ్రెజిల్, చైనా, భారత్‌లో నమోదైంది. ఈ మూడు దేశాల్లో 94 శాతం మంది రోడ్డు  ప్రయాణీకులు తాము రోడ్లపై సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని మార్కెట్లలో ఇదే అత్యధిక శాతం. అయితే, రవాణా రంగ నిపుణుల్లో కేవలం 18%  మంది మాత్రమే ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా, ఈ మూడు దేశాల్లో కలిపి ప్రతి లక్ష మంది జనాభాకు సగటున 16.2 రోడ్డు ప్రమాద మరణాలు నమోదవుతున్నాయి. 

ఇది ఈ అధ్యయనంలో నమోదైన సగటు కంటే దాదాపు రెండింతలు. ‘  భారతదేశంలాగే బ్రెజిల్, చైనాలలో వేగవంతమైన, స్పష్టంగా కనిపించే ఆధునీకరణ, కొత్త మౌలిక సదుపాయాలు, స్మార్ట్‌ వాహనాలు, మెరుగైన సాంకేతికత ల వల్ల  ప్రజల విశ్వాసం కూడా బాగా పెరిగింది,‘ అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన  ఎకనామిస్ట్‌ ఎంటర్‌ప్రైజ్‌ పాలసీ , ఇన్ సైట్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రతిమా సింగ్‌ అంటున్నారు.  ‘కానీ ప్రజల విశ్వాసం వాస్తవ భద్రతా పనితీరును అధిగమించింది. వ్యవస్థలు ఉన్నదానికంటే సురక్షితమైనవని ప్రజలు విశ్వసించినప్పుడు, రోడ్డుపై తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి అవసరమైన శ్రద్ధను వారు విస్మరిస్తారు’’అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

విశ్వాసంలోనూ మార్పు చేర్పులు..
అయితే రోడ్డు భద్రతపై విశ్వాసం అన్ని వర్గాల ప్రజల్లో ఒకే విధంగా కనిపించడం లేదు.  మధ్యతరగతి  అధిక ఆదాయ వర్గాల వారితో పోలిస్తే, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన ప్రయాణీకులు తమ రోజువారీ ప్రయాణ భద్రతపై తక్కువ లేదా మిశ్రమ స్థాయి విశ్వాసాన్ని వ్యక్తం చేయడం దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంది. తరాలవారీగా పరిశీలిస్తే, మిలీనియల్స్‌ అత్యధికంగా రోడ్డు భద్రతపై విశ్వాసం వ్యక్తం చేశారు. వారిలో 94 శాతం మంది తమ ప్రయాణ భద్రతపై అధిక విశ్వాసం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు, జెన్‌ జెడ్‌  బేబీ బూమర్స్‌ వర్గాలు అత్యల్ప స్థాయి విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. ఈ రెండు వర్గాల్లో వరుసగా 12%, 16% మంది తమ రోజువారీ ప్రయాణ భద్రతపై తక్కువ లేదా మిశ్రమ స్థాయి విశ్వాసం ఉన్నట్లు వెల్లడించారు.

మోడ్రన్‌ ఫీచర్లూ ప్రమాదకారకాలే...
వాహనాలు అంతకంతకూ ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న కొద్దీ, ఆటోమేటెడ్‌ మొబిలిటీ వ్యవస్థలతో ప్రయాణీకులు ఎలా ప్రయాణం సాగిస్తున్నారనేది రోడ్డు భద్రతలో కీలకమైన సవాలుగా మారుతోంది. ప్రస్తుతం రవాణా రంగ నిపుణుల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే యాంత్రిక లోపాలను రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా గుర్తిస్తున్నారు. అంతేకాక 30 శాతం మంది నిపుణులు డ్రైవర్‌–అసిస్టెన్్స వ్యవస్థలను సరిగా ఉపయోగించకపోవడం లేదా వాటి పనితీరును సరిగా అర్థం చేసుకోకపోవడమే రోడ్డు భద్రతా సమస్యలకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. మరో 24 శాతం మంది, డ్రైవర్‌ దృష్టిని రహదారి నుంచి మళ్లించే వాహన ఫీచర్లే అత్యంత తీవ్రమైన భద్రతా పరమైన సమస్యగా పేర్కొన్నారు. 

మరోవైపు, ప్రయాణీకులు మాత్రం తమ సొంత డ్రైవింగ్‌ లోపాలే ప్రమాద కారకంగా భావిస్తున్నారు. రవాణా రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రైవర్‌–అసిస్టెన్స్ సాంకేతికతలను మార్కెటింగ్‌ చేసే విధానం కూడా ఈ సమస్యకు ఒక కారణంగా ఉండొచ్చు. సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది ఈ వ్యవస్థల సామర్థ్యాన్ని వ్యాపార ప్రకటనలు వాస్తవానికి మించి చూపుతున్నాయని భావిస్తున్నారుు. అలాగే, 62 శాతం మంది ప్రకటనలు డ్రైవర్లు రహదారిపై తక్కువ శ్రద్ధ చూపినా సరిపోతుందనే భావనను కలిగిస్తున్నాయని చెప్పారు. మరో 60 శాతం మంది, ఈ ప్రకటనలు వ్యవస్థల ప్రయోజనాలను ఎక్కువగా ప్రచారం చేస్తూ, వాటి పరిమితులను తక్కువగా ప్రస్తావిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

నిబంధనల అమలు అత్యవసరం...
తమకు రోడ్‌ సేఫ్టీపై అధిక విశ్వాసం ఉన్నప్పటికీ,  వేగ పరిమితులు తదితర నిబంధనల పటిష్టమైన అమలుతో సహా బలమైన రహదారి భద్రతా చర్యలకు 88% మంది మద్దతు ఇస్తున్నారు  సురక్షితమైన రవాణా వ్యవస్థల కోసం ఎక్కువ చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వీరు చెబుతున్నారు. అయినప్పటికీ, 68% మంది రవాణా నిపుణులు భద్రతను మెరుగుపరచడానికి నియంత్రణ సంస్థలు  పరిశ్రమల మధ్య సమన్వయ లోపమే అతిపెద్ద అడ్డంకి అని గుర్తించారు.  ‘విశ్వాస అంతరాన్ని పూడ్చడానికి మొబిలిటీ ఎకోసిస్టమ్‌ అంతటా సామూహిక చర్య అవసరం,‘ అని బ్రెంబో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్, మాటియో తిరబోస్కి అన్నారు. ‘పరిశ్రమ బాధ్యతాయుతంగా ఆవిష్కరణలు కొనసాగించాలి, విధాన రూపకర్తలు సమర్థవంతమైన నియంత్రణ చట్రాలను సృష్టించాలి.  కొత్త సాంకేతికతల సామర్థ్యాలు  పరిమితులు రెండింటినీ ప్రజలు అర్థం చేసుకోవడానికి వీరంతా సహకరించాలి’’ అన్నారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement