న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు పరిష్కారంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. దీనిని తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాలను కోరారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రియాంకా గాంధీ స్పందిస్తూ.. తాను వయనాడ్ నుండి ఢిల్లీకి తిరిగి వచ్చినప్పుడు రాజధానిని కాలుష్యం బూడిద రంగు కవచంలా కప్పివేయడం చూసి, దిగ్భ్రాంతి చెందానని అన్నారు.
రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉన్నా, వాటిని పక్కనపెట్టి నేతలంతా ఢిల్లీలోని వాయు కాలుష్య సమస్య పరిష్కారం దిశగా ఏదైనా చేయాలని ఎంపీ ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు, సీనియర్ సిటిజన్ల విషయంలో తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలని ఆమె కోరారు. కాలుష్య నియంత్రణ దిశగా తీసుకునే ఏ చర్యలకైనా కాంగ్రెస్ సహకరిస్తుందని ఎంపీ ప్రియాంక గాంధీ హామీనిచ్చారు.
క్లౌడ్ సీడింగ్ ఒక జోక్: జైరామ్ రమేష్
ఇదిలావుండగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన శీతాకాలపు క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్ (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ విమర్శించారు. ఈ ప్రయోగం కోసం రూ. 34 కోట్లు ఖర్చు చేయడాన్ని ఆయన క్రూరమైన జోక్‌గా అభివర్ణించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, భారత వాతావరణ శాఖ మొదలైనవి క్లౌడ్ సీడింగ్‌ను వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా స్పష్టమైన సలహా ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు.
క్లౌడ్ సీడింగ్ ప్రయోగం నాటకీయంగా కనిపిస్తున్నదని, ఈ ప్రయోగంపై ముందు నుంచే పలు సందేహాలు ఉన్నాయని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. ఐఐటీ ఢిల్లీ కూడా తన నివేదికలో శీతాకాలపు క్లౌడ్ సీడింగ్ గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఏ విధంగానూ సహాయపడదని స్పష్టం చేసిందన్నారు. ఒకటి లేదా రెండు రోజుల పాటు పరిమిత ప్రాంతంలో స్వల్ప మెరుగుదల కోసం ఇటువంటి ప్రయోగం చేయడం క్రూరమైన జోక్ తప్ప మరొకటి కాదని జైరామ్ రమేష్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mexico: సూపర్ మార్కెట్‌లో పేలుడు.. 23 మంది మృతి


