ధర్మస్థళ కేసులో సంచలనం.. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య! | Prakash Raj responds after name surfaces in Dharmasthala mass burial case petition | Sakshi
Sakshi News home page

ధర్మస్థళ కేసులో సంచలనం.. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య!

Jun 12 2026 12:08 PM | Updated on Jun 12 2026 1:40 PM

Prakash Raj responds after name surfaces in Dharmasthala mass burial case petition

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చిన్నయ్య జూన్‌ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పేరును ప్రస్తావించారు.

ధర్మస్థళ కేసులో తాము చెప్పినట్లుగా వాంగ్మూలాలు ఇవ్వాలని పలువురు తనను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. వారిలో ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్ ఉన్నారని ఆరోపించారు. గిరీష్‌ మట్టన్నవర‌ ద్వారా ప్రకాష్‌ రాజ్‌ తనతో తమిళంలో మాట్లాడి, జూన్‌ 29న కలుస్తానని చెప్పారని చిన్నయ్య పేర్కొన్నారు.

పిటిషన్‌లో ధర్మస్థళపై ప్రచారం కోసం రూ.200 కోట్లు కేటాయించారని ఆరోపించారు. మహేష్‌ శెట్టి తిమరోడి తనకు సహకరిస్తే రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని చిన్నయ్య పేర్కొన్నారు. అలాగే, ఈ కుట్రకు కావలసిన నిధులు కేరళ నుంచి వచ్చాయని, చిత్రదుర్గకు చెందిన రామ నాగరాజ్‌ కూడా ఆర్థిక సహాయం అందించారని ఆరోపించారు.

చిన్నయ్య తన భార్య ఖాతాకు జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్లు, నగదు చెల్లింపుల వివరాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ కుట్రకు భాగస్వాములైన  మహేష్‌ శెట్టి తిమరోడి, గిరీష్‌ మట్టన్నవర‌, విఠల్‌ గౌడ, జయంత్‌ అని ఆయన ఆరోపించారు. వీరి పేర్లు వెల్లడించినప్పటికీ సిట్‌ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చిన్నయ్య ఫిర్యాదు చేశారు. చిన్నయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు స్వీకరించింది. ధర్మస్థళ కేసు వివరాలు కోరింది. తదుపరి కేసు విచారణను జూన్‌ 29కి వాయిదా వేసింది.

ఈ కేసులో తన పేరు ప్రస్తావన రావడంపై ప్రకాశ్‌ రాజ్ స్పందించారు. ‘ధర్మస్థళ అంశం కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ముడిపడి ఉంది. ప్రస్తుతం నేను చాలా దూరంలో ఉన్నాను. మరో రెండు రోజుల్లో నేనే స్వయంగా వచ్చి మీడియా ఎదుట స్పందిస్తాను. అప్పటి వరకు నా మీద వస్తున్న కల్పిత కథనాలు, జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని’ అని ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement