
రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి
మార్పు జరుగుతుందన్న నమ్మకం ఉంది
‘ప్యూ’ సర్వేలో భారతీయుల మనోగతం
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు అవసరమని భారతీయులు భావిస్తున్నట్లు ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే.. ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ప్రజలు రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళనను కోరుకుంటున్నారని, అయితే ప్రక్షాళన జరగటంపై సందేహాలు వ్యక్తం చేశారని ‘ప్యూ’ తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
ప్రపంచ వ్యాప్తంగా భారత్, అమెరికా, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ వంటి 25 దేశాలలో ‘ప్యూ’ నిర్వహించిన ఈ సర్వేలో 50 శాతానికిపైగా ప్రజలు తమ దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు లేదా పూర్తి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 70 శాతానికిపైగా వ్యక్తం చేశారు. 2025 జనవరి 8 – ఏప్రిల్ 26 మధ్య ‘ప్యూ’ ఈ సర్వేను నిర్వహించింది. సర్వే కోసం 28,333 మంది అభిప్రాయాలు సేకరించింది.
మార్పుపై మనవాళ్లు
భారీ మార్పు అవసరం అన్న భారతీయులు 37 శాతం మంది కాగా, మొత్తం అంతా మారిపోవాలి అన్నవాళ్లు 34 శాతం మంది. అసలు మార్పే అవసరం లేదన్నవారు 9 శాతం మంది, చిన్నచిన్న మార్పులు అవసరం అన్నవారు 16 శాతం మంది. రాజకీయ వ్యవస్థ మారుతుందని 59 శాతం మంది భారతీయులు నమ్ముతుండగా, 10 శాతం మంది తమకు అలాంటి నమ్మకం లేదని తెలిపారు. 25 శాతం మంది కొద్దిపాటి మార్పులు చేస్తే బాగుంటుందని / అసలు మార్పులే అవసరం లేదని అన్నారు.
కొన్ని దేశాల్లో పెదవి విరుపు
రాజకీయ వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు వివిధ దేశాల ప్రజలు వేర్వేరుగా సమాధానాలు ఇచ్చారు. ఉదాహరణకు, దక్షిణ కొరియా వాసుల్లో 87 శాతం మంది రాజకీయ సంస్కరణలు అవసరమని చెప్పినప్పటికీ, అవి జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని అన్నారు. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే, ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు.
నాయకులపై సానుకూలత
ప్రపంచ దేశాలన్నిటిలోనూ నాయకులపై సానుకూల భావనే కనిపించింది. భారతీయులు కూడా – తమ దేశ రాజకీయాల్లో వ్యవస్థాగత మార్పులు అవసరం అంటూనే, తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వాల పట్ల ఎక్కువగా సదభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన ఐదు రకాల గుణగణాలు (నిజాయితీ, ప్రజావసరాలను అర్థం చేసుకోవటం, సమస్యలపై దృష్టి పెట్టటం, నైతిక ప్రవర్తన, యోగ్యతలు).. తమ నాయకులలో అవి ఉన్నదీ లేనిదీ గుర్తించమని ‘ప్యూ’ సర్వే అడిగినప్పుడు ఎక్కువమంది సానుకూలంగా స్పందించారు.
భారతీయులదీ అదే తీరు
భారతీయులు తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వంపై పూర్తి వ్యతిరేకంగా లేరు. 33 శాతం మంది తమ నాయకులు నిజాయితీకి, 31 శాతం మంది ప్రజావసరాలను అర్థం చేసుకునే నైజానికి, 27 శాతం మంది ప్రజా సమస్యలపై పెడుతున్న దృష్టికి, 27 శాతం మంది నైతికతకు, 23 శాతం మంది యోగ్యతలకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు.
మనకు నమ్మకం ఎక్కువే
రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని చెప్పిన దేశాల్లో నైజీరియా మొదటి స్థానంలో (51 శాతం)లో ఉండగా, దక్షిణ కొరియా రెండో స్థానంలో (43 శాతం), ఇండియా మూడో స్థానంలో (34) ఉన్నాయి. 7 శాతంతో స్వీడన్ చివరి స్థానంలో ఉంది. ఎప్పటికైనా మార్పులు జరుగుతాయన్న నమ్మకం ఉన్న దేశాల్లో ఇండియా, కెన్యా రెండూ సమానంగా (59 శాతం) ప్రథమ స్థానంలో ఉండగా; మార్పులు జరుగుతాయన్న నమ్మకం లేని దేశాల్లో ఇండియా (10 శాతం) ఆఖర్న, గ్రీసు మొదట (68 శాతం) ఉన్నాయి.
ఇక నేతల వ్యక్తిత్వాలు, సామర్థ్యాలపై నమ్మకం ఉన్న ఆసియా–పసిఫిక్ దేశాలలో 28 సగటు శాతంతో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (41 శాతం), దక్షిణ కొరియా (34 శాతం), ఇండోనేషియా (31 శాతం) ఉన్నాయి.