
స్త్రీ, పురుషులనే వివక్ష లేదు
లైంగిక వేధింపులకు పాల్పడితే శిక్ష అనుభవించాల్సిందే
కర్ణాటక హైకోర్టు స్పష్టీకరణ
బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ(పోక్సో) చట్టం–2012 కేవలం బాలికలకే కాకుండా బాలురకు సైతం సమానంగా రక్షణ కల్పిస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు స్పష్టంచేశారు. పురుషులతోపాటు మహిళలు సైతం లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, దోషులెవరైనా సరే ఈ చట్టం కింద శిక్ష అనుభవించాలని తేల్చిచెప్పింది. పోక్సో చట్టం పురుషులకు, మహిళలకు సమానంగా వర్తిస్తుందని తెలియజేసింది. కర్ణాటకలో 48 ఏళ్ల ఉపాధ్యాయురాలు తన ఇంటికి పొరుగున ఉండే 13 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించినట్లు పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది.
తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న ఇటీవల విచారణ చేపట్టారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించారు. పోక్సో చట్టం లింగ వివక్ష చూపదని పేర్కొన్నారు. నిందితులు పురుషులా? లేక మహిళలా? అనేది అనవసరమని, నేరం జరిగిందా? లేదా? అనేదే ముఖ్యమని ఉద్ఘాటించారు. పోక్సో చట్టానికి 2019లో చేసిన సవరణ ప్రకారం.. ఈ చట్టం లింగ పరంగా తటస్థంగా మారినట్లు తెలిపారు. ఈ చట్టంలోని సెక్షన్ కింద ఉన్న ‘పర్సన్’ అనే దానికి అర్థం పురుషులు మాత్రమే అని కాదని స్పష్టతనిచ్చారు. బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలితే పురుషులైనా, మహిళలైనా శిక్షార్హులేనని న్యాయమూర్తి వివరించారు.
లైగింక నేరాలను కేవలం పురుషులకే అంటగట్టలేమని జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. 2007 నాటి ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. లైంగిక వేధింపులకు గురవుతున్నవారిలో 54.4 శాతం మంది బాలురు, 45.6 శాతం మంది బాలికలు ఉంటున్నారని వెల్లడించారు. ఐపీసీలోని అత్యాచార చట్టం తరహాలోనే పోక్సో చట్టంలోనూ పురుషులను మాత్రమే నిందితులుగా గుర్తించాలన్న నిందితురాలి తరఫు లాయర్ వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు. పోక్సో ప్రకారం ‘లైంగిక వేధింపులు’ అనే దానికి విస్తృతమైన అర్థం ఉందన్నారు.
ఇది ఐపీసీలోని ‘అత్యాచారం’ లాంటిది కాదని చెప్పారు. 13 ఏళ్ల బాలుడు ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోలేడని, అతడికి అంత సామర్థ్యం ఉండదన్న వాదనను కూడా న్యాయమూర్తి తిప్పికొట్టారు. బాధితుడికి కలిగిన మానసిక క్షోభ సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఈ దర్యాప్తును ట్రయల్ కోర్టుకు అప్పగించారు. సాక్ష్యాధారాల ప్రకారం నిందితురాలిపై దర్యాప్తు కొనసాగించి, శిక్షించాలని ఆదేశించారు.