
వచ్చే నెల 1న పుతిన్‌తో సమావేశం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31, వచ్చే నెల 1వ తేదీల్లో చైనాలో పర్యటించబోతున్నారు. తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో మోదీ సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్–చైనా సంబంధాలు, పరస్పర సహకారంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెల 1వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నరేంద్ర మోదీ భేటీ అవుతారు.
భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో చైనా, రష్యా అధినేతలతో భారత ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశం కాబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్–చైనా మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. భారత్‌పై అమెరికా విధించిన భారీ టారిఫ్‌లను జిన్‌పింగ్ తప్పుపట్టారు.
ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. వూహాన్ సిటీలో షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, మోదీ–పుతిన్ మధ్య జరగబోయే ద్వైపాక్షిక భేటీకి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఇటీవలి కాలంలో ఇండియాకు మరింత దగ్గరయ్యేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్, చైనాల నుంచి మరింత సహకారాన్ని పుతిన్ కోరుకుంటున్నారు. తియాంజిన్‌లో మోదీ, జిన్‌పింగ్, పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు రష్యా ప్రభుత్వం ఇటీవల సంకేతాలిచ్చింది.