ఎలాన్‌ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్‌ | PM Narendra Modi speaks to Elon Musk ahead of Tesla India entry | Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్‌

Apr 19 2025 5:41 AM | Updated on Apr 19 2025 8:51 AM

PM Narendra Modi speaks to Elon Musk ahead of Tesla India entry

సాంకేతికత, నూతన ఆవిష్కరణలపై సంభాషణ  

న్యూఢిల్లీ:  టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. ఇండియన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లోకి త్వరలో టెస్లా అడుగుపెట్టబోతున్న నేపథ్యంతో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మస్క్, మోదీ పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. 

టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ వంటి రంగాల్లో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకార మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. సాంకేతికత, నవీన ఆవిష్కరణల విషయంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లాలని ఉద్ఘాటించారు. మస్క్ తో సంభాషణ అనంతరం మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. మస్క్ తో చక్కటి సంభాషణ జరిగిందన్నారు. వేర్వేరు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో తాము కలిసినప్పుడు చర్చించుకున్న అంశాలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ పైనే తమ మాట్లాడుకున్నామని వివరించారు. ఈ రెండు అంశాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టంచేశారు. మరోవైపు ఇండియన్‌ మార్కెట్‌లో ప్రవేశించానికి టెస్లా ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరులో టెస్లా కార్లు విక్రయించబోతున్నారు. వేలాది టెస్లా కార్లు ఇండియాను ముంచెత్తబోతున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement