బెంగాల్‌కు ఆరు గ్యారంటీలు | PM Narendra Modi pledges six guarantees if BJP wins | Sakshi
Sakshi News home page

బెంగాల్‌కు ఆరు గ్యారంటీలు 

Apr 10 2026 5:42 AM | Updated on Apr 10 2026 5:48 AM

PM Narendra Modi pledges six guarantees if BJP wins

ఆరు గ్యారంటీలు ఇవే..

పరిపాలనా వ్యవస్థలో మార్పులు 

ప్రజలకు జవాబుదారీగా ప్రజాప్రతినిధులు, అధికారులు  

మహిళలపై అకృత్యాలు,అవినీతిపై దర్యాప్తు 

శరణార్థులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు  

చొరబాటుదార్ల ఏరివేత 

ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సవరణ కమిషన్‌  

హల్దియా: క్రూరత్వానికి మారుపేరైన తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పశ్చిమ బెంగాల్‌ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి వైఫల్యానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని, రాష్ట్రాన్ని వెనక్కి లాగుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రగతి కావాలంటే బీజేపీని గెలిపించాలని సూచించారు. బెంగాల్‌లో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. భయానక పాలన నుంచి బెంగాల్‌ను రక్షిస్తామని, సర్వత్రా విశ్వాసం నెలకొనే వాతావరణాన్ని సృష్టిస్తామని ప్రకటించారు.

 రేవు నగరం హల్దియా, అసన్‌సోల్‌తోపాటు సూరి పట్టణంలో గురువారం ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. భయానక వాతావరణం నెలకొని ఉంటే పెట్టుబడులను ఆకర్షించలేమని, విశ్వాసం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నిర్మమ్‌(క్రూరమైన) సర్కార్‌గా అభివర్ణించారు. దేశమంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే బెంగాల్‌ మాత్రం వెనుకంజలోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. 

వికసిత్‌ బెంగాల్‌ స్వప్నం సాకారం కావాలంటే ఈ క్రూర ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే చేపలు, మాంసం తిననివ్వరంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. డిమాండ్‌కు సరిపడా చేపలను ఉత్పత్తి చేయడంలో గత 15 ఏళ్లుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే చేపల ఉత్పత్తిలో బెంగాల్‌ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధాన మంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే..  

వందేళ్లకైనా  విముక్తి లభించదు  
‘‘ప్రతికూల వాతావరణంలోనూ ఈ సభకు జనం భారీగా తరలిరావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ మార్పునకు వారంతా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈసారి తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఉద్వాసన తప్పదు. బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోంది. పూర్బమేదినీపూర్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 16 స్థానాలకు గాను 15 స్థానాలు గెల్చుకుంది. ఈసారి బెంగాల్‌ మొత్తం అదే పరిస్థితి కనిపించబోతోంది. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో సీఎం మమతా బెనర్జీ ఓడిపోతారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌ బెంగాల్‌ యువతకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రైవేట్‌ రంగాన్ని నాశనం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నారు. ఇప్పటిదాకా చేసిన పాపాలకు గాను ఆ పార్టీకి వందేళ్లకైనా విముక్తి లభించదు. 

ఇకపై తృణమూల్‌ ముక్త్‌ బెంగాల్‌  
బెంగాల్‌లో కట్‌ మనీ సంస్కృతిని, సిండికేట్‌రాజ్‌ను అంతం చేస్తాం. తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో మాఫియారాజ్‌ చెలరేగిపోతోంది. బొగ్గు, ఇసుక, మట్టిని దోచుకుంటోంది. ప్రజలకు తీరని అన్యాయం చేస్తోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పాపాలు గరిష్టస్థాయికి చేరాయి. ఈ పార్టీని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది.

‘మా, మాటీ, మనుష్ ’నినాదం ఉత్తదే..  
తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చట్టాలకు విలువ లేకుండాపోయింది. మహా జంగిల్‌రాజ్‌దే ఇక్కడ పెత్తనం. మాల్డా జిల్లాలో ఇటీవల జ్యుడీషియల్‌ అధికారులను నిర్బంధించారు. చట్టవిరుద్ధంగా మనదేశంలోకి ప్రవేశించినవారి వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రంలో పాలన మారగానే చొరబాటుదార్ల పోషకులపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తాం. ఊచలు లెక్కబెట్టిస్తాం. తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘మా, మాటీ, మనుష్ ’నినాదం ఉత్తదేనని తేలిపోయింది. మా(తల్లి) రోదిస్తోంది. మనుషులు భయంతో బతుకున్నారు. ఇక్కడి భూములను చొరబాటుదార్లు ఆక్రమించారు. చొరబాటుదార్ల కారణంగా స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. బీజేపీ సర్కార్‌ వచ్చాక జీ రామ్‌ జీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. పేదలకు ఉపాధి కల్పిస్తాం’’అని ప్రధాని మోదీ ప్రకటించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement