
విపక్షాలపై మోదీ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అధికారంలో ఉండగా రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసి, చట్టాలను కాలరాసి, అంబేడ్కర్ ఆశయాలను పాతర వేసినవారే నేడు అదే రాజ్యాంగ ప్రతులను తలపై పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. డ్రామాలాడుతున్నారు’’ అని మండిపడ్డారు. రూ.11,000 కోట్లతో నిర్మించిన ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్డును ఆదివారం ఢిల్లీలో ఆయన ప్రారంభించారు.
అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలైన హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘సామాజిక న్యాయం గురించి పెద్ద మాటలు చెబుతున్న విపక్షాలు అధికారంలో ఉండగా బడుగు బలహీన వర్గాలను దగా చేసే చట్టాలు, నిబంధనలు తెచ్చాయి. ఆ తిరోగమన చట్టాలను వందలాదిగా రద్దు చేస్తున్నాం’’ అని మోదీ వివరించారు.
‘వికసిత్’ నమూనాగా ఢిల్లీ
ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ప్రజలు బీజేపీ భుజాలపై పెద్ద బాధ్యత పెట్టారని మోదీ అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేలా ఆ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని వివరించారు. ‘‘కొన్ని పార్టీలు ప్రజాతీర్పును ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నాయి. ప్రజల విశ్వాసానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా బతుకుతున్నాయి. ఢిల్లీలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కొన్ని నెలల క్రితం పెద్ద కుట్రలు జరిగాయి.
ఢిల్లీకి వచ్చే తాగు నీటిలో హరియాణా ప్రజలు విషం కలిపారంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఆ ప్రతికూల రాజకీయాల నుంచి ఢిల్లీవాసులకు స్వేచ్ఛ లభించింది. వికసిత్ భారత్‌కు ఢిల్లీని ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దుతాం’’ అన్నారు. జీఎస్టీలో అత్యాధునిక సంస్కరణల రూపంలో దీపావళికి దేశవాసులకు డబల్ బోనస్ దక్కనుందని శ్లాబుల తగ్గింపును ఉద్దేశించి పునరుద్ఘాటించారు. జీఎస్టీ సంస్కరణలకు సహకరించాలని ప్రజలను కోరారు. వాటితో పేదలు, మధ్య తరగతి ప్రజలతోపాటు చిన్న, పెద్ద వ్యాపారాలకు మేలు జరుగుతుందన్నారు.