విశ్వసనీయ వారధిగా మారండి

PM Narendra Modi attends BJP national executive committee meeting in Delhi - Sakshi

పార్టీకి, ప్రజలకు మధ్య అనుసంధానం కార్యకర్తలే

బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ

బీజేపీ ఒక కుటుంబం చుట్టూ తిరిగే పార్టీ కాదు

‘సేవా, సంకల్పం, అంకితభావం’పై ఆధారపడిన పార్టీ

ప్రజలకు సేవ చేయడమే బీజేపీకి పరమావధి

న్యూఢిల్లీ: పార్టీకి, సామాన్య ప్రజలకు మధ్య విశ్వసనీయ వారధిగా మారాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్‌ఎండీసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.

సేవా, సంకల్పం, అంకితభావం అనే విలువలపై ఆధారపడి బీజేపీ పని చేస్తోందని చెప్పారు. కేవలం ఒక కుటుంబం చుట్టే తిరగడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, ఒక కుటుంబం పెత్తనం కింద కొనసాగడం లేదన్నారు. ప్రజా సంక్షేమం అనే సంస్కృతే బీజేపీకి ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. ప్రజల బాగు కోసం పని చేస్తోంది కాబట్టే  కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని వివరించారు. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కార్యకర్తలు ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే బీజేపీకి పరమావధి అని స్పష్టం చేశారు.

అభివృద్ధి ఎజెండాకు ప్రజామోదం
తెలంగాణలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిందని మోదీ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్‌ ఉప ఎన్నికలోనూ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుందని వివరించారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి కేవలం 750 ఓట్లు వచ్చాయని, ఈసారి ఏకంగా 21,000కుపైగా ఓట్లు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధి అజెండాకు ప్రజామోదం లభిస్తోందనడానికి ఇవే నిదర్శనాలని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్‌ నేతలు, కార్యకర్తలతో సంబంధాలు పెంచుకోవాలని, వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని బీజేపీ శ్రేణులకు సూచించారు.

కార్యకర్తలకు నడ్డా దిశానిర్దేశం
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షులు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని వివరిస్తూ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.   ఈ ఏడాది డిసెంబర్‌ 25 నాటికి 10.40 లక్షల పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో బూత్‌ లెవెల్‌ కమిటీల ఏర్పాటును పూర్తిచేస్తామన్నారు.

రాజకీయ తీర్మానం
ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను కొనియాడుతూ, ప్రతిపక్షాల అవకాశవాద వైఖరిని ఎండగడుతూ బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఘన విజయం సాధించడం ఖాయమని తీర్మానంలో పేర్కొన్నారు.

మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం పట్ల మోదీని అభినందించారు.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్‌ రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రతిపక్షాలు పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top