మహిళా రిజర్వేషన్లతో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం | PM Modi says women participation in policy making strengthens journey towards Viksit Bharat | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్లతో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం

Apr 15 2026 4:39 AM | Updated on Apr 15 2026 4:39 AM

PM Modi says women participation in policy making strengthens journey towards Viksit Bharat

 మహిళల భాగస్వామ్యంతో ‘వికసిత్‌ భారత్‌’సాధ్యం  

మీ స్థానిక ఎంపీలకు  లేఖ రాయండి  

ప్రత్యేక  సమావేశాల్లో పాల్గొనేలా ప్రోత్సహించండి  

మహిళలకు ప్రధాని మోదీ లేఖ

న్యూఢిల్లీ:  లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేస్తే భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతమై, చైతన్యవంతంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 2029లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు కోటా అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మహిళలకు మంగళవారం లేఖ రాశారు. లేఖను ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. విధానాల రూపకల్పన, కీలక నిర్ణయాల్లో మహిళామణులు క్రియాశీలక పాత్ర పోషిస్తే ‘వికసిత్‌ భారత్‌’దిశగా మన ప్రయాణం మరింత బలం పుంజుకుంటుందని వెల్లడించారు.

అందువల్ల మన అభివృద్ధి పథానికి మరింత ఊపునిచ్చేందుకు చేయగలిగినదంతా చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ విషయంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. 2023లో ’నారీశక్తి వందన్‌ అధినియం’ఆమోదానికి దారితీసిన పరిణామం ఇదేనని వివరించారు. వచ్చే ఎన్నికల్లో చట్టం అమలుకు వీలుగా రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్లు తెలిపారు. మహిళల ఇప్పటికే బహుళ రంగాల్లో రాణిస్తున్నారని, చట్టసభల్లోనూ వారి భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి  తేలి్చచెప్పారు.  

బిల్లు ఆమోదం కోసం మహిళల ఎదురు చూపులు  
‘నారీశక్తి వందన్‌ అధినియం’సవరణను ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా ఆమోదించాలని ప్రధాని మోదీ వెల్లడించారు. ఏమాత్రం ఆలస్యం జరిగినా మహిళలకు అన్యాయం చేసినట్లే అవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడం కోసం దేశంలోని మహిళలంతా ఎదురు చూస్తున్నారని తాను           కచ్చితంగా నమ్ముతున్నట్లు తెలిపారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పెంచడం చాలా ముఖ్యమని, అందుకోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కుల కోసం ఆడబిడ్డలను ఇంకా వేచి ఉండేలా చేయలేమని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలో మహిళల గళం బలపడినప్పుడు ప్రజాస్వామ్య గళం కూడా బలపడుతుందన్నారు.  పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం కోట్లాది మంది మహిళల ఆశీస్సులు కోరుకుంటున్నామని మోదీ స్పష్టంచేశారు. స్థానిక ఎంపీలకు లేఖలు రాసి, చరిత్రాత్మక ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొనేలా ప్రోత్సహించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు.

శతాబ్దాల పాటు పెపుప్రభావం చూపే గొప్ప పని చేయబోతున్నారంటూ ఎంపీలకు గుర్తు చేయాలని కోరారు. ఇది కచ్చితంగా వారిలో స్ఫూర్తిని నింపుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఆశించిన ఫలితం ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం నారీశక్తి వందన్‌ అధినియం పట్ల మహిళల్లో అపారమైన ఉత్సాహం కనిపిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement