
న్యూఢిల్లీ: రేపు.. ఆగస్టు 15న భారతదేశం తన 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలకు సారధ్యం వహించనున్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర సంబరాలు ‘నయ భారత్’ ఇతివృత్తం చుట్టూ తిరగనున్నాయి. ఎర్రకోటపై పంద్రాగస్టున జరిగే కార్యక్రమాలివే..
గార్డ్ ఆఫ్ హానర్..
ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు ప్రధానమంత్రి మోదీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్వాగతిస్తారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసులకు చెందిన 96 మంది సిబ్బందితో కూడిన గార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రధాని అందుకోనున్నారు.
ఘనంగా గన్ సెల్యూట్
అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట ప్రాకారాల వద్దకు వెళతారు. అక్కడ ఫ్లయింగ్ ఆఫీసర్ రషికా శర్మ జాతీయ జెండాను ఎగురవేయడంలో ప్రధానికి సహాయం చేస్తారు. ఈ సమయంలో స్వదేశీ 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్ ఉపయోగించి 1721 ఫీల్డ్ బ్యాటరీ ద్వారా 21-గన్ సెల్యూట్ జరగనుంది.
అగ్నివీరుల జాతీయ గీతాలాపన
మొదటిసారిగా 11 మంది అగ్నివీర్ సంగీతకారులు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఈ సమయంలో రెండు ఐఏఎఫ్ ఎంఐ 17 హెలికాప్టర్లు పూల రేకులను కురిపించనున్నాయి. వీటిలో ఒకటి త్రివర్ణ పతాకాన్ని మోసుకెళుతుంది. మరొకటి ‘ఆపరేషన్ సిందూర్’ జెండాను ఎగురవేయనుంది.
‘ఆపరేషన్ సిందూర్’ విజయం హైలెట్
ఈ ఏడాది వేడుకలు ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రతిబింబించనున్నాయి. ఆపరేషన్ సింధూర్ లోగో ఎర్రకోటలోని జ్ఞానపథ్‌లో కనిపించనుంది. పూల అలంకరణ ప్రముఖంగా నిలవనుంది.
ఎన్‌సీసీ క్యాడెట్లు ‘నయా భారత్’ లోగో..
జ్ఞానపథ్‌లో 2,500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ‘నయా భారత్’ లోగోను రూపొందించనున్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ముగింపు అనంతరం జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ వేడుకలకు దేశంలోని విభిన్న రంగాలకు చెందిన సుమారు ఐదువేల మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపేందుకు వివిధ రాష్ట్రాల నుండి సాంప్రదాయ దుస్తులలో 1,500 మంది ఆహ్వానితులు తరలిరానున్నారు.