
ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం
‘పహల్గాం’కు త్వరలో దీటైన జవాబు
ఎప్పుడు, ఎలాగన్నది వారిష్టమని స్పష్టి కరణ
‘పహల్గాం’కు త్వరలో దీటైన జవాబు... ఎప్పుడు, ఎక్కడ, ఎలాగన్నది వారిష్టం బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాల్సిందే దేశమంతా అదే కోరుతోందన్న ప్రధాని సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో భేటీ పాల్గొన్న రాజ్‌నాథ్, ఎన్‌ఎస్‌ఏ దోవల్ ఎన్‌ఎస్‌జీ చీఫ్‌తో హోం కార్యదర్శి భేటీ పాల్గొన్న బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ చీఫ్‌లు సరిహద్దుల్లో కొనసాగిన పాక్ కాల్పులు
ఉగ్రవాదంపై పోరాటంలో జవాన్లు పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉగ్ర ముష్కరులకు, వారి సూత్రధారులకు చెప్పబోయే గుణపాఠం దాయాది జన్మలో మర్చిపోలేని రీతిలో ఉండాలి.
ప్రతీకారానికి వేళైంది. ఉగ్ర వేటకు రంగం సిద్ధమైంది. ఈ దిశగా మంగళవారం రోజంతా కీల క పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘పహల్గాం’ కు దీటుగా బదులిచ్చేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ మంత్రి సమక్షంలో త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసముంది. ‘పహల్గాం’ ముష్కరులకు, వారి సూత్రధారుల కు ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులిస్తారో మీ ఇష్టం’’ అంటూ ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. మరోవైపు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా మోదీతో సమావేశమయ్యారు.
పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్‌ఎస్‌జీ చీఫ్‌తో కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్ తదితర కీలక దళాల చీఫ్‌లు కూడా భేటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మరిన్ని కీలక పరిణామాలు బుధవారం చోటు చేసుకోనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా భద్రత, రాజకీయ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలతో మోదీ వరుస భేటీలు, ఆపై కేంద్ర కేబినెట్ భేటీ జరగనున్నాయి. దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగాలవారీగా తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించి ఆమోదముద్ర వేస్తారని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ‘పహల్గాం’ ముష్కరులకు, వెనకుండి వారిని నడిపిస్తున్న దాయాది దేశానికి మర్చిపోలేని గుణపాఠం చెప్పేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమవుతోంది. ఆ పాశవిక ఉగ్ర దాడికి పాల్పడ్డ, ప్రేరేపించిన వారు కలలో కూడా ఊహించని రీతిలో శిక్షించి తీరతామని ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అంతం చేసి తీరాల్సిందే. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని ఖతం చేయాలన్నది దేశ సమష్టి సంకల్పం.
పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇవ్వక తప్పదు. ఉగ్ర ముష్కరులపై మన ప్రతిస్పందన ఎలా ఉండాలో నిర్ణయించే స్వేచ్ఛను సైన్యానికే ఇస్తున్నాం. శత్రువుపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలన్న దానిపై ఎలాంటి నిర్ణయమైనా సైన్యం తనంత తానుగా తీసుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. ప్రధాని మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో త్రివిధ దళాల అధిపతులు జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్‌తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గంటన్నరపాటు జరిగిన ఈ కీలక భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనీల్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.
పహల్గాం దాడి, తదనంతర పరిణామాలపై లోతుగా చర్చించారు. తగిన ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందేనని ప్రధాని పునరుద్ఘాటించారు. సైనిక దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసముందన్నారు. ‘‘ఉగ్రవాదంపై పోరాటంలో జవాన్లు పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరుపై ప్రధాని ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డట్టు సమాచారం. ఉగ్ర ముష్కరులకు, వారి సూత్రధారులకు చెప్పబోయే గుణపాఠం దాయాది జన్మలో మర్చిపోలేని రీతిలో ఉండాలని ఆయన నిర్దేశించారు.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లో పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత లష్కరే తొయిబా ముసుగు సంస్థకు చెందిన ముష్కరులు కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. దీనిపై 140 కోట్ల పై చిలుకు భారతీయుల రక్తం మరిగిపోతోందని, ముష్కరులతో పాటు వారిని ప్రేరేపించిన వారిని కూడా కఠినాతి కఠినంగా శిక్షించి తీరతామని ఆదివారం మన్ కీ బాత్‌లో కూడా మోదీ పునరుద్ఘాటించారు.
హోం శాఖ ఉన్నత స్థాయి భేటీ
త్రవిధ దళాధిపతులతో మోదీ సమావేశానికి ముందే మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో మరో ఉన్నతస్థాయి భేటీ జరిగింది. బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) డీజీ బ్రిఘూ శ్రీనివాసన్, అస్సాం రైఫిల్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా, సశస్త్ర సీమాబల్ అదనపు డీజీ అనుపమ నీలేకర్ చంద్రతో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ కీలక భేటీలో పాల్గొన్నారు.
పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాదుల అణచివేతతోపాటు దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నా అసలు అజెండా వేరేనంటున్నారు. భేటీలో చర్చించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచారు. పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల రక్షణ బీఎస్‌ఎఫ్ బాధ్యత. మయన్మార్ సరిహద్దులను అస్సాం రైఫిల్స్ గస్తీ కాస్తుంది. ఇక ఎన్‌ఎన్‌జీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషలైజ్డ్ కమెండో విభాగం.
2016లో సర్జికల్ స్ట్రైక్స్ 2019లో ‘బాలాకోట్’ ఇప్పుడెలా ఉంటుందో!
ప్రతీకార చర్యలపై ఉత్కంఠ
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముష్కర మూకపై, వారికి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తున్న దాయాదిపై ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఉగ్ర దాడులకు ప్రతిస్పందనగా మోదీ సర్కారు పాక్ భూభాగంపై 2016లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో చేసిన బాలాకోట్ వైమానిక దాడులు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. భారత్ నుంచి ఈ స్థాయి దాడులను ఊహించని పాక్ ఒక్కసారిగా బిత్తరపోయింది. 2016లో జమ్మూ కశ్మీర్‌లోని ఉరి సెక్టర్లో సైనిక క్యాంప్‌పై జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడ్డారు.
18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా సైన్యానికి చెందిన స్పెషల్ ఫోర్సెస్ కమెండోలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. కనీసం 200 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశారు. 2019లో జమ్మూలోని పుల్వామాలో సీఆరీ్పఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో వైమానిక దాడులు జరిపి వందలాది మంది ముష్కరులను మట్టుబెట్టింది.
12 మిరాజ్ ఫైటర్ జెట్లు పాక్ కన్నుగప్పి, వారి రాడార్ వ్యవస్థలను ఏమార్చి లక్ష్యాలపై నిప్పుల వర్షం కురిపించాయి. బాలాకోట్‌లోని జైషే మహ్మద్ శిక్షణ స్థావరాలను నామరూపాల్లేకుండా చేసింది. గత అనుభవాల నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కనుక ఈసారి కూడా భారత ప్రతి చర్య దాయాది ఊహించని విధంగా ఉంటుందని రక్షణ నిపుణులు అంటున్నారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో క్షిపణి దాడుల వంటివి ఒక ఆప్షన్. కానీ ఆ క్రమంలో పాక్ ఆర్మీ యూనిట్లకు నష్టం వాటిల్లితే పరిస్థితి అదుపు తప్పి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. కనుక ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే’’ అని చెబుతున్నారు.