16 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు | Parliament to reconvene on 16 April 2026 | Sakshi
Sakshi News home page

16 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

Apr 3 2026 5:10 AM | Updated on Apr 3 2026 5:53 AM

Parliament to reconvene on 16 April 2026

కీలక బిల్లు కోసం మూడు రోజుల భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు స్వల్ప విరామం తర్వాత ఈ నెల 16వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలు వరుసగా మూడు రోజులపాటు ప్రత్యేకంగా కొలువుదీరుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయడంతోపాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కు పెంపు, రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచడానికి ఉద్దేశించిన బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనున్నట్లు సమాచారం. 

ఈ నెల 16, 17, 18న లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. షెడ్యూల్‌ ప్రకారం గురువారం నిరవధికంగా వాయిదా పడాల్సిన ఉభయ సభలు, ప్రత్యేక సమావేశాల దృష్ట్యా 16వ తేదికి వాయిదా పడ్డాయి. కీలకమైన బిల్లుపై చర్చ కోసం ఉభయ సభలు త్వరలోనే భేటీ అవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రకటించారు. కొన్ని ముఖ్యమైన బిల్లులు, అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. వాటిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి.

 ప్రభుత్వం పెత్తందారులాగా వ్యవహరిస్తోందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అంశంతో రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఏ బిల్లును ఎప్పుడు తీసుకురావాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. త్వరలో సభ మళ్లీ సమావేశం కాబోతుందని, అందుకు కారణం ఏమిటో సభ్యులకు తెలుసని కిరణ్‌ రిజిజు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు జైరామ్‌ రమేశ్‌ తప్పుపట్టారు. 

కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఈ సమయంలో బిల్లు తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. ఇది పూర్తిగా అభ్యంతరకరమని చెప్పారు. ఏప్రిల్‌ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో హామీని నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కిరణ్‌ రిజిజు బదులిచ్చారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో ఈ అంశానికి సంబంధం లేదన్నారు. ముఖ్యమైన బిల్లుపై రాజకీయం చేయొద్దని విపక్షాలను కోరారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. బిల్లును ఎప్పుడు, ఎలా తీసుకురావాలన్న దానిపై డ్రామాలు ఆడొద్దని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement