భారత సైనిక విన్యాసాలకు అడ్డంకులు సృష్టించే యత్నం
తమ గగనతలంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు
న్యూఢిల్లీ: భారత సైన్యం ‘త్రిశూల్’ విన్యాసాలకు సిద్ధమవుతోంది. భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈ నెల 30 నుంచి నవంబర్ 10 దాకా త్రివిధ దళాలు ఈ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం కలిసికట్టుగా నిర్వహించే ఈ విన్యాసాల ద్వారా త్రివిధ దళాల ఉమ్మడి కార్యాచరణ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడంతోపాటు భారతదేశ ఆత్మనిర్భరతను చాటిచెప్పబోతున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
ఇటీవలి కాలంలో ఇవి అతిపెద్ద సైనిక విన్యాసాలుగా రికార్డుకెక్కబోతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే అతిపెద్ద సైనిక కసరత్తు అని చెప్పొచ్చు. భారత సైన్యం తలపెట్టిన ‘త్రిశూల్’ పట్ల పొరుగుదేశం పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్(నోటీసు టు ఎయిర్‌మెన్) జారీ చేసింది.
మధ్య, దక్షిణాది గగనతలంలోని పలు ఎయిర్ ట్రాఫిక్ మార్గాల్లో ఈ ఆంక్షలు విధించింది. ఆయా మార్గాల్లో విమానాల రాకపోకలపై నియంత్రణ విధిస్తారు. అయితే, ఇందుకు కారణాలు ఏమిటన్నది బహిర్గతం చేయలేదు. త్రిశూల్ విన్యాసాల నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం సైనిక విన్యాసాల పట్ల పాక్ బెంబేలెత్తిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. త్రిశూల్‌కు అడ్డంకులు సృష్టించాలన్నదే పాక్ ప్రయత్నంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సర్ క్రీక్‌పై వివాదం
త్రిశూల్ విన్యాసాల కోసం 28,000 అడుగుల ఎత్తువరకు గగనతలాన్ని రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషకుడు డామియన్ సైమన్ పంచుకున్నారు. త్రిశూల్ కోసం ఎంచుకున్న ప్రాంతం, అందుకోసం జరుగుతున్న సన్నద్ధత ‘అసాధారణం’ అని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలో జరిగే ఈ విన్యాసాల్లో సదరన్ కమాండ్ కూడా చురుగ్గా పాల్గొనబోతుందని రక్షణ శాఖ తెలియజేసింది.
ఎడారి, కొండలు, అడవులు, సముద్రం.. ఇలా విభిన్నమైన భౌగోళిక పరిస్థితుల్లో విన్యాసాలు జరగబోతున్నాయి. సర్ క్రీక్‌పై భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. సర్ క్రీక్ పూర్తిగా తమదేనని రెండు దేశాలు వాదిస్తున్నాయి. ఇది రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతం. సర్ క్రీక్‌లో అవాంఛనీయ చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెప్తామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే పాకిస్తాన్‌ను హెచ్చరించారు.
చరిత్రను, భౌగోళిక పరిస్థితులను మార్చేలా తమ ప్రతిస్పందన ఉంటుందని ఆయన తేలి్చచెప్పారు. సర్ క్రీక్ భారత్‌లోని గుజరాత్, పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్ మధ్యనున్న చిత్తడి నేలలతో కూడిన ప్రాంతం. ఇక్కడ మానవ ఆవాసాలు లేవు. దీని పొడవు 96 కిలోమీటర్లు. భద్రత, సైనిక పరంగా రెండు దేశాలకు ఇది కీలకమైనది. సర్ క్రీక్‌లో సైనిక మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. అందుకే పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్రిశూల్ విన్యాసాల కోసం భారత సైన్యం సర్ క్రీక్‌ను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


