breaking news
Sir Creek Area
-
అంగుళం భూమి కూడా వదులుకోం
భుజ్: దేశ సరిహద్దుల్లో మన భూభాగంలో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. మన భూభాగాన్ని కాపాడుకొనే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. దేశాన్ని కాపాడే విషయంలో సైనిక దళాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భారత సైనిక దళాలను చూస్తే శత్రువులకు వణుకు తప్పదని అన్నారు. దుష్ట శక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్‌లో ప్రధాని మోదీ గురువారం బీఎస్ఎఫ్తోపాటు త్రివిధ దళాల సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఏటా సైనికులతోపాటు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సర్ క్రీక్‌లో వేడుకల సందర్భంగా జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని యుద్ధక్షేత్రంగా మార్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. శత్రు దేశం ఈ ప్రాంతంపై చాలా ఏళ్లుగా కన్నేసిందని, ఆక్రమించుకొనేందుకు కుట్రలు చేస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్’ ఏర్పాటు చేస్తాం ‘‘దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను ఆక్రమించడానికి గతంలో కుట్రలు జరిగాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను శత్రుదేశం కుట్రలపై గొంతు విప్పాను. దేశాన్ని రక్షించే విషయంలో మన సైనిక దళాల సామర్థ్యంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. మన దేశాన్ని శత్రువుగా భావించేవారి మాటలు మేము నమ్మడం లేదు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం వేర్వేరు విభాగాలు. కానీ, ఆ మూడు దళాలు ఒక్కటైతే దేశ సైనిక బలం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనే పదవిని సృష్టించాం. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
‘సర్ క్రీక్’ అత్యంత కీలకం: నిర్మలా
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశభద్రత విషయంలో గుజరాత్‌లోని పాక్ సరిహద్దున ఉన్న ‘సర్ క్రీక్’ ప్రాంతం అత్యంత కీలకమైనదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. గుజరాత్ భద్రతకు సైతం కీలకమైన ఈ ప్రాంతాన్ని త్వరలోనే సందర్శిస్తానన్నారు. అక్కడి సరిహద్దు భద్రతను సమీక్షించి, అక్కడి సైనికుల్లో మరింత స్పూర్తినింపేలా వారితో మాట్లాడతానని చెప్పారు. అరేబియా సముద్రతీరంలోని భారత్–పాక్ సరిహద్దు భూభాగాన్ని సముద్రజలాలు 96 కి.మీ. పొడవునా లోపలికి చొచ్చుకొచ్చి వేరుచేశాయి. ఇలా వేరుబడిన పొడవైన భూభాగాన్ని ‘సర్‌క్రీక్’ సరిహద్దుగా వ్యవహరిస్తున్నారు. రోజూ త్రివిధ దళాధిపతులతో భేటీ: రక్షణలో వ్యూహాత్మక అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఇకపై ప్రతీరోజు త్రివిధ దళాధిపతులతో నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. సైనిక వనరుల సముపార్జనకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను వెంటనే ఆమోదించేందుకు ప్రతీ 15రోజులకు డిఫెన్స్ అక్విజీషన్ కౌన్సిల్‌ను సమావేశపరచాలని నిర్ణయించారు.