అమెరికా మాపై దాడిచేస్తే మేం భారత్‌పై బాంబులేస్తాం | Pakistan Ex-Envoy Abdul Basit Bomb India Remark During US-Iran War | Sakshi
Sakshi News home page

అమెరికా మాపై దాడిచేస్తే మేం భారత్‌పై బాంబులేస్తాం

Mar 22 2026 5:01 AM | Updated on Mar 22 2026 11:02 AM

Pakistan Ex-Envoy Abdul Basit Bomb India Remark During US-Iran War

ఢిల్లీ, ముంబై మా లక్ష్యాలు 

పాక్‌ మాజీ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ వాచాలత్వం

న్యూఢిల్లీ: కరడుగట్టిన ఛాందసవాదం, వితండవాదానికి పాకిస్తాన్‌ చిరునామా అని ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్‌ బాసిత్‌ మారోమారు నిరూపించారు. భారత్‌ మీద తమ అంతులేని విద్వేషాన్ని తన వాచాలత్వం ద్వారా బాసిత్‌ మరోమారు రుజువుచేసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం దక్షిణాసియాకు విస్తరించి అమెరికాగనక పాకిస్తాన్‌పై దాడి చేస్తే ప్రతిగా అమెరికాపై దాడిచేయాల్సిందిపోయి భారత్‌పై బాంబులేస్తామని బాసిత్‌ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్‌ దౌత్యవర్గాల్లోనూ జిహాదీవాదం ఒంటబట్టించుకున్న వితండవాదులకు కొదవలేదని భారత్‌ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

 సీఎన్‌ఎన్‌–న్యూస్‌18తో జరిగిన ఒక చర్చావేదికలో బాసిత్‌ మాట్లాడారు. ‘‘యుద్ధంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ పైచేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయెల్‌కు తదుపరి లక్ష్యంకావొచ్చు. ఇజ్రాయెల్‌ చెప్పుడుమాటలు వినే అమెరికాకు అప్పుడు పాకిస్తాన్‌ అణుకార్యక్రమాలు రుచించకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్‌పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ దాడి చేస్తే ప్రతిదాడి చేసే సత్తా పాకిస్తాన్‌కు ఉంది. అయితే ప్రతిదాడి కోసం అమెరికా ప్రధాన భూభాగం లేదా గల్ఫ్‌ లేదా ఇజ్రాయెల్‌పై మేం దాడిచేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూరంగా ఉన్నాయి. 

సమీప లక్ష్యం మీదే మేం దాడిచేయగలం. అలాంటి సమీప లక్ష్యం ఒక్క భారత్‌ మాత్రమే. ఏమాత్రం ఆలస్యంచేయకుండా ముంబై, న్యూఢిల్లీలపై దాడులుచేస్తాం. తర్వాత ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధంలేదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం’’అని అన్నారు. ‘‘మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే. భారత్‌లోని మెట్రోపాలిటన్‌ నగరాలపై దాడులు చేస్తాం’’అని అన్నారు. దీంతో భవిష్యత్‌లో అమెరికాతో సంబంధాలు చెడిపోతే దాని విపరిణామాలను భారతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్లు బాసిత్‌ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

శత్రుదేశం(అమెరికా)పై ఎదురుదాడి చేసే దమ్ములేక పొరుగుదేశంపై బాంబులేసే నిస్సహాయ పాకిస్తాన్‌ వైఖరి బాసిత్‌ మాటలతో బహిర్గతమైందని అంతర్జాతీయ రాజకీయవిశ్లేషకులు తప్పుబడుతున్నారు. ‘‘బాసిత్‌ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. సైన్యం కనుసన్నల్లో నడిచే పాక్‌ ప్రభుత్వాల కుటిలనీతిలో నిర్లజ్జ నియమాలు ఎలా ఉంటాయో బాసిత్‌ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధం దక్షిణాసియాకు విస్తరిస్తే పాకిస్తాన్‌ పట్ల మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని బాసిత్‌ మాటలు హెచ్చరిస్తున్నాయి’’అని భారత నిఘా వర్గాలు సూచించాయి.

Advertisement
 
Advertisement
Advertisement