
ఏఐ ప్రభావంతో మూతపడుతున్నవి కొన్ని
నిధుల లేమితో షట్‌డౌన్ అయినవి మరికొన్ని
రెండేళ్లలో 28 వేలకుపైగా కంపెనీల మూసివేత
ఎన్నో ఆశలతో పెడుతున్న అంకుర కంపెనీలు.. ఇటీవలి కాలంలో మూతపడుతున్నాయి. కృత్రిమ మేధ సృష్టించిన అలజడి.. పోటీ.. నిధుల రాక తగ్గిపోవడం.. ఖర్చులు పెరిగిపోవడం.. ఇలా అనేక కారణాలు. ప్రధానంగా కంటెంట్‌పైనే ఆధారపడ్డ స్టార్టప్స్‌పై ఏఐ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎడ్‌టెక్, స్టోరీటెల్లింగ్ ప్లాట్‌ఫామ్స్, మార్కెటింగ్ వంటి రంగాలలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్‌లను నడిపించేందుకు, విస్తరించేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇంకేముంది 2023, 2024లో ఏకంగా 28,000 పైచిలుకు స్టార్టప్స్ మూతపడ్డాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
వెర్సే ఇన్నోవేషన్.. జోష్, డెయిలీహంట్ సంస్థల మాతృసంస్థ.. ఈ ఏడాది మేలో 350 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రధానంగా ఏఐలో పెట్టుబడులు పెడుతున్నట్టు, ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కోడ్ ప్యారట్, సటల్.ఏఐ, వూరి, లొకేల్.ఏఐ, అస్త్ర.. ఇలాంటి ఏఐ స్టార్టప్‌లు ఇటీవలికాలంలో చాలా మూతపడ్డాయి. ఇందుకు.. ఏఐలో వేగంగా వస్తున్న మార్పులు, మారిపోతున్న సాంకేతికత, అధికమవుతున్న పోటీ, నిధుల సమస్య పెరుగుతున్న వ్యయాలు.. ఇలాంటి అనేక కారణాలు.
రూ.21,000 కోట్ల నష్టం
చాట్‌జీపీటీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతి సంవత్సరం అంటే 2023లో భారత్‌లో ఏకంగా 15,921 టెక్ స్టార్టప్‌లు మూతపడ్డాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య 2,101 మాత్రమే. 2024లో 12,717 స్టార్టప్స్ కనుమరుగైపోయాయి. షట్టర్లు దించేసిన కంపెనీల సంఖ్య 2022 వరకు నాలుగు అంకెలకే పరిమితం అయింది. గత రెండేళ్లలో అనూహ్యంగా అయిదు అంకెల స్థాయికి చేరడం ఆందోళన కలిగించే అంశం. కరోనా తదనంతర పరిస్థితులు కూడా కొంతవరకు కారణమయ్యాయి.
ముఖ్యంగా ఏఐ వల్ల.. అగ్రిటెక్, ఫిన్‌టెక్, ఎడ్‌టెక్, హెల్త్‌టెక్ రంగాల్లోని స్టార్టప్‌లు అధికంగా ప్రభావితమయ్యాయి. ‘ఐఎన్‌సీ42’ వెబ్‌సైట్ ‘ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్ 2025’ ప్రకారం.. 2025 సెప్టెంబర్ వరకు స్టార్టప్స్ 5,600లకుపైగా ఉద్యోగులను తొలగించాయి. 2023–24లో 67 స్టార్టప్స్ రూ.21,472 కోట్ల నష్టాన్ని ప్రకటించాయి.
ఏఐ కంపెనీల దూకుడు
ఏఐ రాకతో కంటెంట్ రూపకల్పనలో వ్యయం తగ్గుతోంది. ఈ రంగంలో ప్రవేశానికి అడ్డంకులను తొలగించింది. ఏఐ ఎంట్రీతో టెక్ స్టూడియోల అవసరం తీరిపోయింది. అంతేకాదు ఖరీదైన స్టార్టప్స్ ఏర్పాటు చేయాల్సిన పనికూడా లేదు. కంటెంట్ సులువుగా, చవకగా దొరుకుతోంది. జనానికీ అందుబాటులో ఉంటోంది.
ఆదాయం విషయంలో నిర్దిష్ట టర్నోవర్‌కు చేరుకోవడానికి కంపెనీలకు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు నెలల్లోనే ఏఐ స్టార్టప్స్ అది సాధ్యం చేస్తున్నాయి. ఏర్పాటైన 12–18 నెలల్లోనే 10 మిలియన్ డాలర్ల వార్షికాదాయం స్థాయికి చేరుతున్నాయంటే ఏఐ కంపెనీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సగానికి తగ్గాయి
ఏఐ దూకుడు.. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన స్టార్టప్‌లను సైతం తుడిచిపెట్టేస్తోంది. పెట్టుబడిదారులు ఇప్పుడు ఏఐ మార్పులను తట్టుకొని దీర్ఘకాలంలో లాభాలను అందించే వ్యాపార విధానాలపై దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. స్టార్టప్స్‌లోకి రావాల్సిన నిధులూ తగ్గుముఖం పట్టాయి.
భారతీయ స్టార్టప్స్ 2021, 2022లో ఏటా 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఫండింగ్ అందుకోగా.. గత రెండేళ్లలో ఈ మొత్తం దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. 2024లో భారత్‌కు చెందిన అంకుర సంస్థలు 3.7 బిలియన్ డాలర్ల నిధులను దక్కించుకున్నాయి. 2025 ఆగస్ట్ నాటికి ఈ మొత్తం కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే.
