ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ : మాస్క్‌ల విషయంలో వైద్య నిపుణులు చెప్తున్న జాగ్రత్తలు ఏంటంటే..

Omicron Effect Mask Wear Tips Other Precautions Details In Telugu - Sakshi

కొత్త సంవత్సర వేడుకలు, పండుగల నేపథ్యాల్లో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విజృంభించొచ్చన్న వైద్య వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.  ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయన్న ఆందోళన నడుమే..  వ్యాక్సినేషన్‌ రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది కూడా. అదే తరుణంలో మాస్క్‌ల వాడకం, ఇతర జాగ్రత్తల గురించి కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. 

కరోనా వేరియెంట్‌లలో డెల్టా, ఒమిక్రాన్‌ వేరియెంట్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ తరుణంలో వైద్య నిపుణులు ‘మాస్క్‌ అప్‌గ్రేడ్‌’ థియరీని తెరపైకి తీసుకొచ్చారు. అంటే.. ఇప్పుడు వాడుతున్న వాటి కంటే మెరుగైన మాస్క్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్‌ వేరియెంట్‌ల స్థాయికి సాధారణ మాస్క్‌లు సరిపోవంటున్నారు  గ్లోబల్‌ హాస్పిటల్స్‌ పల్మనాలిజీ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ హరీష్‌ ఛాప్లే.  సాధారణ మాస్క్‌లు, సర్జికల్‌ మాస్క్‌ల కంటే..  ఎన్‌95, ఎఫ్‌ఎఫ్‌పీ2, కేఎన్‌95 మాస్క్‌లు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బందిని ఇవి కచ్చితంగా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌, ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే హైరిస్క్‌ ఉన్న వాళ్లు ఈ తరహా మాస్క్‌లు ఉపయోగించాలని చెప్తున్నారు.

అయితే ఇమ్యూనిటీ జోన్‌లో ఉన్నవాళ్లు, వ్యాక్సిన్‌ డోసులు పూర్తి చేసుకున్నవాళ్లు క్లాత్‌ మాస్క్‌ల ద్వారా కూడా రక్షణ పొందవచ్చని ఇంటెర్నల్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వినీత తనేజా చెప్తున్నారు. కాకపోతే సింగిల్‌, డబుల్‌ లేయర్‌ మాస్క్‌ల కంటే మూడు పొరల మాస్క్‌ల్ని ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఒకవేళ సింగిల్‌, డబుల్‌ లేయర్‌ మాస్క్‌లు గనుక ఉపయోగిస్తున్నట్లయితే.. వాటిపైనా మరో మాస్క్‌ ధరించడం మేలని చెప్తున్నారు.

ఇక ఎలాంటి మాస్క్‌ ధరించాలని ఎంచుకోవడం కంటే.. దానిని సరిగా ధరించడం ఇప్పుడు తప్పనిసరి అవసరం. ఎందుకంటే వైరస్‌ వేరియెంట్లు ఎంత ప్రమాదకరమైనవి అయినా.. రక్షణ కల్పించే మార్గం ఎక్కువగా ఇదొక్కటి మాత్రమే అని డాక్టర్‌ వినీత చెప్తున్నారు. చాలామంది మాస్క్‌ను కిందకి పైకి జారవేస్తూ ఉంటారు. కానీ, దీనివల్ల రిస్క్‌కు ఛాన్స్‌ ఉంటుంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో మాస్క్‌ను ముక్కు పైభాగం నుంచి గదవ భాగం వరకు పూర్తిగా కప్పి ఉంచడం ఉత్తమమని డాక్టర్‌ వినీత చెప్తున్నారు.  


ఉత్తగా ధరించడం కాదు..   
కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో చాలామంది జాగ్రత్తలను పక్కాగా పాటించారు. అయితే రాను రాను ఆ వ్యవహారం చిరాకు తెప్పించడమో లేదంటే వ్యాక్సినేషన్‌ ఇచ్చిన ధైర్యమోగానీ ఆ అలవాట్లను చాలావరకు దూరం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్‌ల విషయంలో అయినా కనీస జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మాస్క్‌ టిప్స్‌

మాస్క్‌లను తీసేటప్పుడు, ధరించేటప్పుడు వాటి చివరల దారాలను మాత్రమే ముట్టుకోవాలి. 

క్లాత్‌ మాస్క్‌లను ఒక్కసారిగా వాడాక శుభ్రంగా ఉతకాలి. వేడినీళ్లలో ఉతక్కూడదు.

సర్జికల్‌ మాస్క్‌లను మళ్లీ ఉపయోగించడం మంచిదికాదు. 

ఇంట్లో అందరి మాస్క్‌లను కలిపి ఉంచకూడదు. విడివిడిగా ఉంచాలి. 

మాస్క్‌ మీద శానిటైజర్‌ చల్లడం, రుద్దడం లాంటివి చేయకూడదు.

మాస్క్‌లకు డ్యామేజ్‌లు, లీకేజీలు లేకుండా చూసుకోవాలి. 

ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్క్‌లను పదే పదే కిందకి జరపడం లాంటివి చేయకపోవడం మంచి అలవాటు. 

పిల్లలకు నాన్‌ మెడికల్‌ మాస్క్‌లు వాడడం మంచిది. 

పిల్లలకు ఆరోగ్య సమస్యలుంటే గనుక వైద్యులను సంప్రదించి మెడికల్‌ మాస్క్‌లు వాడొచ్చు. 

మాస్క్‌ జాగ్రత్తగా వాడడమే కాదు.. వాటిని పారేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించడం ఒక బాధ్యత.   


మరికొన్ని..

పదే పదే ముఖాన్ని చేతులతో రుద్దకపోవడం. 

సామూహిక భోజనాలకు దూరంగా ఉండడం.

తరచూ చేతుల్ని సబ్బుతో, హ్యాండ్‌వాష్‌తో క్లీన్‌ చేసుకోవడం.

చలికాలంలో జలుబు, ఇతర సమస్యల కారణంగా అలర్జీతో ముక్కులో వేలు పెడుతుంటారు. అలా చేయకపోవడం ఉత్తమం.

శానిటైజర్‌ రాసిన చేతులతో తినుబండారాల్ని తాకరాదు. 

శానిటైజర్‌ను క్యారీ చేయడం మరీ మంచిది.

మాస్క్‌ను ధరిస్తూ శుభ్రతను పాటిస్తూ వీలైనంత మేర భౌతిక దూరం పాటిస్తే సాధారణ జాగ్రత్తలతోనూ కరోనా వేరియెంట్లను జయించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top