లక్నో: వేతనాలు పెంచాలంటూ నిన్న ( సోమవారం) గ్రేటర్ నోయిడా (యూపీ)లో కార్మికులు ఆందోళన చేపట్టిన హింసాత్మకంగా మారింది. అయితే నిరసనలపై యూపీ కార్మిక శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనల వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై లోతైన విచారణ చేపడుతున్నామని తెలిపారు.
గ్రేటర్ నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతంలో వరుసగా నాలుగో రోజు జరుగుతున్న ఈ నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో రగిలిపోయిన కార్మికులు పోలీసుల వాహనాలను బోల్తా కొట్టించి, రాళ్ల దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అదుపు తప్పుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు ఆందోళనకారులు పలు కంపెనీల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, ఒక వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై యూపీ మంత్రి స్పందించారు.
ఆయన మాట్లాడుతూ "నోయిడాలో జరిగిన నిరసనలు రాష్ట్ర అభివృద్ధికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ్యంతోనే జరిగినట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం, మీరట్ నోయిడాలలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర జరిగిందనే అవకాశాలు బలపడుతున్నాయి. ఏజెన్సీలు ఈ మొత్తం విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి," అని రాజ్‌భర్ అన్నారు.
కాగా నిన్న జరిగిన నిరసనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనల్లో హింసను సృష్టించిన దాదాపు 300 మందిని ఇప్పటివరకూ అరెస్టు చేసినట్లు తెలిపింది. మరో వందమందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముజఫర్ నగర్‌లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో దానికి ఇబ్బందులు కలిగించడానికి ఈ ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కార్మికులందరూ సంయమనం పాటించాలని ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు ప్రభావితం కాకూడదని విజ్ఞప్తి చేశారు.


