‘అనవసరంగా ఇరికించారు.. తనే కీలక సాక్షి’

NIA Takes Down Businessman Name In Its Most Wanted List - Sakshi

ఉగ్రవాదుల లిస్టులో వ్యాపారవేత్త పేరు.. కోర్టు ఆదేశాలతో తొలగించిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ/రాంచీ: మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదుల లిస్టులో ప్రముఖ వ్యాపారవేత్త పేరును చేర్చిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. ఉగ్రవాదుల జాబితా నుంచి అతడి పేరు, ఫొటోను వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే సదరు వ్యాపారవేత్తపై నమోదు చేసిన అభియోగాలు మాత్రం సరైనవేనని స్పష్టం చేసింది. అసలు ఏం జరిగిందంటే.. బొగ్గు వ్యాపారం, స్టీల్‌ ప్లాంట్లు కలిగి ఉన్న అధునిక్‌ గ్రూప్‌ అధినేత మహేష్‌ అగర్వాల్‌ జార్ఖండ్‌లో బొగ్గు ఆధారిత పవర్‌ ప్లాంటును నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా స్థానిక మావోయిస్టు సంస్థ తృతీయ ప్రస్తుతి కమిటీ(టీపీసీ)కి అతడు నిధులు సమకూరుస్తున్నట్లు ఎన్‌ఐఏ చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2016 నాటి కేసు(బిహార్‌, జార్ఖండ్‌లో వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి నక్సల్స్‌ భారీ మొత్తంలో దోచుకున్నారన్న ఆరోపణలు)కు సంబంధించి ఈ ఏడాది జనవరి 10న ఈ మేరకు అభియోగాలు నమోదు చేసింది. (చదవండి: దీపావళి: చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం!)

ఈ నేపథ్యంలో రాంచిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మహేష్‌కు వ్యతిరేకంగా నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జనవరి 17 నాటి ఈ ఆదేశాల తర్వాత ఎన్‌ఐఏ తన వెబ్‌సైట్‌లో మహేష్‌ అగర్వాల్‌ను మోస్ట్‌వాంటెడ్‌ ఉ‍గ్రవాదిగా పేర్కొంటూ అతడి ఫొటోను అప్‌లోడ్‌ చేయడం చర్చకు దారితీసింది. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అగర్వాల్‌ తరఫు న్యాయవాది నితీశ్‌ రానా జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘నా క్లైంట్‌ను అనవసరంగా ఇరికించారు. నిజానికి తను ఈ కేసులో కీలక సాక్షి. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ కూడా ధ్రువీకరించింది. 2019లో ప్రత్యేక న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164 కింద మహేష్‌ను సాక్షిగా పేర్కొంటూ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చింది. కానీ అకస్మాత్తుగా ఆయనను నిందితుడిగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. 

అంతేకాదు ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేనప్పటికి తీవ్రమైన అభియోగాలు నమోదు చేసింది.  అంతేకాదు ఉగ్రవాదుల జాబితాలో ఆయన పేరు, ఫొటోను ఉంచి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించింది’’అని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబరు 21న మహేష్‌ అగర్వాల్‌ పేరును ఉగ్రజాబితా నుంచి తొలగించిన ఎన్‌ఐఏ, అభియోగాలను మాత్రం యథాతథంగా ఉంచినట్లు నవంబరు 3న దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే ఈ విషయంపై అధికారులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top