జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్ ప్రమాద ఘటనకు సంబంధించి చివరి క్షణాలను చూపే కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రాథమిక భద్రతా వ్యవస్థలు ఎంత దారుణంగా విఫలమయ్యాయో కళ్లకు కట్టిస్తోంది. ఆ వీడియోలో, పర్యాటకులు క్రూయిజ్ లోపల కూర్చుని ఉండగా.. అకస్మాత్తుగా నీరు లోపలికి రావడం వీడియోలో కనిపిస్తోంది. క్షణాల్లోనే పర్యాటకుల ఆనందం.. భయంగా మారింది.. తుపాను గాలుల తాకిడికి పడవ ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో నీరు లోపలికి దూసుకొచ్చింది.
పడవ మునిగిపోవడం ప్రారంభమైన తర్వాతే.. సిబ్బంది కట్టలు కట్టి ఉన్న లైఫ్ జాకెట్లను విప్పడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు ప్రాణ భయంతో అటు ఇటు పరుగులు తీస్తున్నారు. చాలా మందికి లైఫ్ జాకెట్లు అందలేదు. సీలు చేసిన స్టోరేజ్ బాక్సుల నుంచి వాటిని తీసుకోవడానికి వారు తీవ్రంగా శ్రమించారు. నిబంధనలు పాటించలేదని.. తుపాను సమయంలో ప్రయాణికులను గాలికి వదిలేశారని బాధితులు చేసిన ఆరోపణలకు ఈ వీడియో ఇప్పుడు సాక్ష్యంగా నిలుస్తోంది.
నిబంధనలు ప్రకారం.. ప్రయాణం ప్రారంభించే ముందే ప్రతి ప్రయాణికుడికి లైఫ్ జాకెట్ అందించాలి. పర్యాటకులు కచ్చితంగా ధరించాలి. కానీ.. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేవలం 29 మందికి మాత్రమే టిక్కెట్లు జారీ చేసినప్పటికీ.. క్రూయిజ్‌లో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి.. గంటకు 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించినప్పటికీ కూడా.. ఈ రద్దీగా ఉన్న పడవను బర్గి డ్యామ్ నీటిలోకి అనుమతించడం గమనార్హం.
🚨 Jabalpur Cruise Last Video: People fighting for life
The video was captured just 15 minutes before the cruise sank in the river. You can see the sheer panic people desperately fighting for their lives as the water began to rise and engulf the boat.
This shocking footage has… pic.twitter.com/z2pNogMNC9— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 1, 2026
ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు చిన్నారులతో సహా నలుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం నిలిపివేసిన సెర్చ్ ఆపరేషన్‌ను శనివారం ఉదయం 5 గంటలకు తిరిగి ప్రారంభించారు. 72 ఏళ్ల రియాజ్ హుస్సేన్.. ప్రమాదం జరిగిన తర్వాత నాలుగు గంటల పాటు నీటిలోనే ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. బాధిత ప్రయాణికుడు ప్రదీప్ మాస్సే మాట్లాడుతూ.. క్రూయిజ్ నిర్వాహకులు మమ్మల్ని కదలకుండా కూర్చోమని చెప్పారు.. మాకు కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదు. నా భార్య మరీనా మాస్సే, నాలుగేళ్ల కుమారుడు త్రిషాన్ మృతదేహాలు దొరికాయి. నేను ఒక ట్యూబ్ పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాను, స్థానికులు తాడు వేసి నన్ను ఒడ్డుకు చేర్చారు" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాయంత్రం 6:15 గంటలకు సమాచారం అందినప్పటికీ.. మొదటి రెస్క్యూ టీమ్ 6:40 గంటలకు బయలుదేరింది. ఆ వాహనం స్టార్ట్ కాకపోవడంతో సమయం వృధా అయ్యింది. ఆ తర్వాత మరో వాహనంలో పరికరాలను తరలించి, రెండో బృందం రాత్రి 7 గంటలకు బయలుదేరింది. ఈ జాప్యం ప్రాణ నష్టానికి కారణమై ఉండవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక జాలర్లు, రైతులు ప్రాణాలకు తెగించి 15 మందికి పైగా కాపాడారు. ఆ తర్వాతే ఎన్డీఆర్‌ఎఫ్ వంటి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు బాధ్యులెవరో ఈ కమిటీ తేల్చనుంది.


