
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలుపుతున్న ప్రధాని మోదీ
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై ఘన విజయం
తమిళనాడు నుంచి ఈ పదవిని చేపట్టనున్న మూడో నేతగా ఘనత
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్‌కు 452, సుదర్శన్‌రెడ్డికి 300 తొలి ప్రాధాన్యత ఓట్లు
152 ఓట్ల తేడాతో గెలుపొందిన ఎన్డీయే కూటమి అభ్యర్థి.... మొత్తం పోలైన ఓట్లు 767.. వాటిలో చెల్లనివి 15 ఓట్లు
98.20 శాతంగా నమోదైన పోలింగ్.. ఓటింగ్‌కు గైర్హాజరైన 13 మంది ఎంపీలు
ఇండియా కూటమి నుంచి పలువురు ఎంపీల క్రాస్‌ఓటింగ్
సుదర్శన్‌రెడ్డికి 324 ఎంపీల మద్దతుందని భావించినా 300 ఓట్లకే పరిమితం
రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, ఖర్గే శుభాకాంక్షలు
ఎంపీల తీర్పును అంగీకరిస్తున్నట్లు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ 15వ ఉపరాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) తరఫున పోటీ చేసిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి 300 ఓట్లు పొందారు.
దీంతో 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. దీంతో రాధాకృష్ణన్ త్వరలోనే ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేపట్టనున్నారు. తమిళనాడు నుంచి ఈ పదవిని అధిష్టించిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్‌ల తర్వాత మూడో నాయకుడిగా సీపీ రాధాకృష్ణన్ చరిత్రకెక్కారు.
ఘన విజయం...
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నూతన పార్లమెంట్ భవనంలోని ‘వసుధ ఎఫ్–101’లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ పోలింగ్‌లో మొత్తంగా 767 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 6, లోక్‌సభలో ఒక ఖాళీ స్థానాన్ని పక్కనబెడితే లోక్‌సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది కలిపి 781 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.
అయితే ముందే ప్రకటించినట్లుగా బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎంపీలు, ఏడుగురు బీజేడీ ఎంపీలతోపాటు శిరోమణి అకాలీదళ్ ఎంపీ ఒకరు, స్వతంత్ర ఎంపీ సరబ్‌జీత్‌సింగ్ ఖల్సా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మొత్తంగా 767 (98.2 శాతం) ఓట్లు పోలయ్యాయి. విజయానికి అవసరమైన ఓట్లను 377గా నిర్ణయించారు.
సాయంత్రం 6 గంటల నుంచి ఓట్లను లెక్కించి రాత్రి 7:30 గంటలకు ఫలితాన్ని ప్రకటించారు. మొత్తం పోలైన 767 ఓట్లలో చెల్లని ఓట్లు 15 ఉండగా మిగిలిన 752 ఓట్లలో రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యతా ఓట్లు లభించాయని.. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు.
అనుకున్నట్లే క్రాస్ ఓటింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఇండియా కూటమిలోని పక్షాలు, తమకు మద్దతుగా వచ్చిన ఆప్ సహా ఇతర చిన్నాచితక పార్టీలతో కలిసి కాంగ్రెస్ కనీసం 324 ఓట్లు వస్తాయని అంచనా వేసింది. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ప్రతిపక్షాలు ఐక్యంగా నిలబడ్డాయి.
కూటమికి చెందిన 315 మంది ఎంపీల్లో అందరూ ఓటింగ్ కోసం హాజరయ్యారు’అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతోపాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 20–25 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
మరోవైపు రాధాకృష్ణన్‌కు ఎన్డీయే కూటమిలోని 427 మంది ఎంపీల మద్దతు ఉందని బీజేపీ కాగితంపై లెక్కలేసుకోగా పోలింగ్‌లో మాత్రం అంతకన్నా ఎక్కువగానే ఓట్లు లభించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో నిర్వహించిన సమర్థవంతమైన ఫ్లోర్ మేనేజ్‌మెంట్ కారణంగా ఎన్డీయే సునాయాశ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ కూటమి పక్షాలకు రెండ్రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు, మిత్రపక్షాలతో సమన్వయం, పోలింగ్‌కు ముందు ప్రాంతాలవారీగా ఎంపీలతో సమన్వయం రాధాకృష్ణన్ గెలుపునకు దోహదం చేసిందని చెబుతున్నారు.
మిన్నంటిన సంబరాలు..
సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించిన వెంటనే బీజేపీలో సంబరాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి నివాసం ముందు తమిళనాడు సంప్రదాయాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సీపీ రాధాకృష్ణన్‌కు బీజేపీ ఎంపీలతోపాటు ఆయనకు మద్దతిచ్చిన పక్షాల ఎంపీలు శుభాకంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, ఖర్గే శుభాకాంక్షలు
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర అమిత్ షా సహా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్ట్‌లు చేశారు. ‘ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు అభినందనలు. ప్రజాజీవితంలో దశబ్దాల గొప్ప అనుభవం, దేశ పురోగతికి గణనీయంగా దోహడపతుంది. విజయవంతమైన, ప్రభావవంతమైన పదవీకాలం కోసం మీకు ఇవే నా శుభాకాంక్షలు’అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘రాధాకృష్ణన్‌కు ఎంపీగా, వివిధ రాష్ట్రాల గవర్నర్‌గా గొప్ప అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ చురుకైనవి. గవర్నర్‌గా పదవీకాలంలో, సాధారణ పౌరులు ఎదుర్కొన్న సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. ఈ అనుభవాలు ఆయనకు శాసన, రాజ్యాంగ విషయాలపై అపార జ్ఞానం ఉందని నిర్ధారించాయి. ఆయన స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకం ఉంది‘ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రాధాకృష్ణన్ నాయకత్వ లక్షణాలను, పరిపాలనపై ఆయనకున్న లోతైన జ్ఞానాన్ని అమిత్ షా ప్రశంసించారు. రాధాకృష్ణన్ అనుభవం, అట్టడుగు స్థాయి నేపథ్యం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అణగారిన వర్గాలకు సేవ చేయడానికి సహాయపడతాయని షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగువ సభ సంరక్షకుడిగా ఆయన కొత్త పాత్రలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి పెదవివిప్పని జగ్‌దీప్ ధన్‌ఖడ్.. సీపీ రాధాకృష్ణన్ విజయం నేపథ్యంలో తొలిసారి స్పందించారు. ప్రజాజీవితంలో రాధాకృష్ణన్‌కు ఉన్న అపార అనుభవంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం మరింత ఖ్యాతిని పొందుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు లేఖ రాశారు.
ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నాం: ఖర్గే
‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు. ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్‌రెడ్డి పోరాటానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాధాకృష్ణన్ పార్లమెంటరీ సంప్రదాయాల అత్యున్నత నైతికతను నిలబెట్టుకుంటారని, ప్రతిపక్షాలకు గౌరవాన్ని ఇస్తారని, ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నా.
వర్షాకాల సమావేశాల్లో జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు, ఇది ఎందుకు అనేది ఎప్పటికీ వివరించలేం. రాజ్యాంగ స్థానాలపట్ల గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.