
బాలేంద్ర షా పేరును స్మరిస్తున్న జెన్ జెడ్
కాఠ్మండు: నేపాల్‌లో ఒకవైపు రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతుండగా మరోవైపు, అక్కడి యువత తదుపరి ప్రధానిని మీరే చేపట్టాలంటూ కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా అలియాస్ బాలేన్‌కు పెద్ద ఎత్తున మద్దతుగా ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారు. దీంతో, ఇప్పుడు బాలేన్ పేరు మారుమోగిపోతోంది. రాజధానిలో పరిణామాల నేపథ్యంలో బాలేన్ ఫేస్‌బుక్‌లో మంగళవారం ..‘ర్యాలీ నిర్వాహకులు 28 ఏళ్లలోపు వాళ్లే పాల్గొనాలనే వయో పరిమితి విధించిన కారణంగానే సోమవారం జరిగిన ర్యాలీలో పాల్గొనలేకపోయా.
వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం’అని పేర్కొన్నారు. ‘ఇది జెన్ జెడ్ చేపట్టిన ఆకస్మిక ఉద్యమమన్నది సుస్పష్టం. నేను కూడా వారికి పెద్దవాడిలా అనిపించవచ్చు. వారి ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆలోచనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. రాజకీయ పార్టీలు, నాయకులు ఈ ర్యాలీని తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదు.
యువతకు పూర్తి మద్దతు తెలుపుతున్నా’అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఆయన పేరు అన్ని రకాల సామాజిక మాధ్యమ వేదికల్లోనూ మారుమోగిపోయింది. ‘బాలేన్, సారథ్యం మీరే చేపట్టండి’అని ఎక్స్‌లో ఒకరు కోరారు. 1990లో కాఠ్మండులో పుట్టిన బాలేన్ అక్కడే సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. భారత్‌లోని కర్నాటకలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో పీజీ చేశారు.