
ఇండియా టుడే–సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 324 సీట్లు లభిస్తాయని ఇండియా టుడే–సీ వోటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే’లో తేలింది. విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమికి కేవలం 208 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 14 దాకా ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా.. దేశవ్యాప్తంగా వివిధ లోక్‌సభ నియోజకవర్గాల్లో 54,788 మందిని ప్రశ్నించారు. సీవోటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా ద్వారా మరో 1,52,038 మంది అభిప్రాయాలు సేకరించారు.
మొత్తం 2,06,826 మంది వ్యక్తి చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. తాజాగా సర్వే నివేదిక విడుదల చేశారు. దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే మళ్లీ ఘన విజయం సాధించడం తథ్యమని సర్వే తేల్చింది. పార్టీల పరంగా చూస్తే బీజేపీకి సొంతంగా 260 సీట్లు, కాంగ్రెస్‌కు సొంతంగా 97 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది. 2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 44 శాతం ఓట్లు లభించగా, ఇప్పుడు 46.7 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే పేర్కొంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాలకు గాను బీజేపీ కేవల 240 స్థానాలు గెలుచుకుంది. మెజార్టీకి 32 సీట్లు తక్కువొచ్చాయి. దాంతో మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా ఎన్డీయేకు ఇప్పుడు 293 సీట్లున్నాయి. ఇక విపక్ష ఇండియా కూటమి గత ఎన్నికల్లో 234 సీట్లు సాధించింది.