National Herald Case: సోనియా, రాహుల్‌కు భారీ షాక్‌.. ఆ కార్యాలయానికి ఈడీ సీల్‌

National Herald Office Sealed By ED - Sakshi

సాక్షి, ఢిల్లీ:  సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు భారీ షాక్‌ తగిలింది. ఢిల్లీ హెరాల్డ్‌ హౌజ్‌ బిల్డింగ్‌లో ఉన్న యంగ్‌ ఇండియన్‌ ఆఫీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ED సీల్‌ వేసింది. మనీల్యాండరింగ్‌ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్‌ ప్రాంగణం తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది ఈడీ.

ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో.. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూఢిల్లీలోని హెరాల్డ్‌ హౌజ్‌లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ ఆఫీస్‌కు సీల్‌ వేసింది ఈడీ. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను నడిపించిన అసోషియేట్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ నుంచి యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.  ఇందులోనే సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు గరిష్ట వాటాల ఉన్నాయి. ఇక హెరాల్డ్‌ హౌజ్‌ సీల్‌కు సంబంధించి ఈడీ తరపున స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

తాజాగా నేషనల్‌ హెరాల్డ్‌ హౌస్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్‌ హెరాల్డ్‌ న్యూస్‌పేపర్‌ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 10 జన్‌ఫథ్‌లోని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద, ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద అదనపు పోలీస్‌ బలగాలు మోహరించాయి. ఆఫీస్‌కు ఈడీ సీల్‌ వేయడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top