
వాణిజ్య పెంపే ధ్యేయంగా తెరచుకోనున్న మూడు సరిహద్దు పాయింట్లు
సత్సంబంధాల మెరుగు కోసం విస్తృత చర్చలు జరిపిన విదేశాంగ మంత్రులు
12 అంశాలపై ఇరుదేశాల మధ్య కుదిరిన పరస్పర అవగాహన
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణ ఉదంతం తర్వాత క్షీణించిన భారత్, చైనా సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మంగళవారం ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలో చైనాలో మోదీ పర్యటన నేపథ్యంలో భారత్‌లో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మంగళవారం విస్తృతస్థాయి చర్చలు జరిపారు. పలు రంగాల్లో పరస్పర సహకారం, అభివృద్దే లక్ష్యంగా 12 అంశాలపై ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపు ధ్యేయంగా సరిహద్దులను తెరవడం, ఇరువైపులా పెట్టుబడుల వరద పారించడం, నేరుగా పౌరవిమానయాన సేవలను పునరుద్దరించడం వంటి కీలక అంశాలపై నేతలు అవగాహనకొచ్చారు.
అమెరికా మోపిన అధిక టారిఫ్ భారం కారణంగా పరోక్షంగా చాన్నాళ్ల తర్వాత భారత్, చైనా ఏకతాటి మీదకు రావడం విశేషం. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల కీలక ఉమ్మడి ఆశయాల అమలుకు కృషిచేయాలని ఇరు పక్షాలు మంగళవారం నిర్ణయించాయి. లిపులేఖ్ పాస్, షిప్కీ లా పాస్, నాథూ లా పాస్ సరిహద్దుల గుండా తిరిగి విస్తృతస్థాయిలో వాణిజ్యం చేయాలని జైశంకర్, వాంగ్ నిర్ణయించారు. స్నేహపూర్వక సంప్రతింపుల ద్వారా సరిహద్దు వెంట మళ్లీ శాంతిస్థాపనకు ప్రయత్నించనున్నారు. ఈ మేరకు 12 అంశాలతో సంయుక్త పత్రాన్ని నేతలు విడుదలచేశారు. పర్యాటకులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు, ఇతర కారణాలతో సందర్శించే వ్యక్తులకు వీసాలు ఇవ్వాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
వచ్చే ఏడాది కైలాశ్ పర్వత యాత్ర, మానస్‌సరోవర్ యాత్ర కోసం భారతీయులను చైనా అనుమతించనుంది. ఇరుదేశాల భూభాగాల్లో ప్రవహించే నదీజలాలపై సహకారం, ప్రవాహస్థాయిలు, వరదలపై ఎప్పటికప్పుడు సమాచార మారి్పడికి, ఇరుదేశాల నిపుణుల స్థాయి వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వడం వంటివి ఈ సంయుక్త పత్రాల్లో చోటు దక్కించుకున్నాయి. భారత్‌కు అరుదైన ఖనిజాలు, ఎరువుల ఎగుమతులపై ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను సడలించడానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అంగీకరించారు. భారత్‌కు అవసరమైన అరుదైన ఖనిజాలు, ఎరువులు సరఫరా చేస్తామని వాంగ్ హామీ ఇచ్చారు. ఖనిజాలు, ఎరువులతోపాటు టన్నెల్ బోరింగ్ మెషిన్ల అవసరం ఉందని జైశంకర్ చెప్పగా, వాంగ్ యీ వెంటనే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
‘‘తైవాన్‌పై మా వైఖరిలో మార్పు లేదు’’
తైవాన్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత ప్రభుత్వ వర్గాలు మంగళవారం తేల్చిచెప్పాయి. వాంగ్‌తో సమావేశమైనప్పుడు చైనాలో తైవాన్ అంతర్భాగం అని జైశంకర్ వ్యాఖ్యానించినట్లు చైనా విదేశాంగ శాఖ పొరపాటున తెలియజేసింది. దీనిపై భారత ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పష్టతనిచ్చాయి. ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలోనే తైవాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. తైవాన్‌తో భారత్‌కు చక్కటి సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాయి.
భారత్ – చైనా సంబంధాలు పైపైకి: మోదీ
భారత్–చైనా మధ్య సంబంధాలు స్థిరంగా పురోగమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరస్పర ప్రయోజనాలను, అవసరాలను గౌరవించుకుంటూ ముందుకెళ్తున్నాయని తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. భారత్–చైనా సంబంధాలపై వారు మాట్లాడుకున్నారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజన్ సిటీలో చైనా అధినేత జిన్‌పింగ్‌తో భేటీ అయ్యానని, అప్పటి నుంచి భారత్–చైనా సంబంధాలు వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల నడుమ స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధ బాంధవ్యాల వల్ల ఆసియాతోపాటు ప్రపంచంలో శాంతి, సౌభాగ్యం నెలకొంటాయని మోదీ స్పష్టంచేశారు.