ఇతిహాసాల్లో ఇంధన సంక్షోభానికి పరిష్కారాలు | Nalanda University Students Apply Ancient Indian Epics Ramayana And Mahabharata To Modern Global Diplomacy | Sakshi
Sakshi News home page

ఇతిహాసాల్లో ఇంధన సంక్షోభానికి పరిష్కారాలు

May 26 2026 10:48 AM | Updated on May 26 2026 11:30 AM

Nalanda University Students Apply Ancient Indian Epics to Modern Global Diplomacy

రాజ్‌గిర్‌: బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో నూతన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను, రామాయణ-మహాభారతాలలోని సూత్రాలతో ఎలా పరిష్కరించవచ్చనే అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. ప్రపంచంలోని 30కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు భారతదేశ పురాణ ఇతిహాసాలను దౌత్యపరమైన ఆయుధాలుగా మలుచుకుంటూ అంతర్జాతీయ సంబంధాల (ఐఆర్‌పీఎస్‌) విభాగంలో సరికొత్త విశ్లేషణలు చేస్తున్నారు.

ఇతిహాసాలే దౌత్య మార్గదర్శకాలు
నలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశ్యం మన పురాతన జ్ఞాన సంపదను ఆధునిక ప్రపంచ సమస్యలతో అనుసంధానించడమే. ఒక సంక్షోభ సమయంలో భారతదేశం తన వ్యూహాలను ఎలా రూపొందించుకోవాలి? అగ్రరాజ్యాల మధ్య సంబంధాలను ఎలా నిర్వహించాలి? వంటి ప్రశ్నలకు పురాతన భారతీయ గ్రంథాలు గొప్ప పరిష్కారాలను చూపుతున్నాయని ఆయన వెల్లడించారు.

రామాయణం - సుగ్రీవ మైత్రి ఒక వ్యూహం
ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు వివిధ పరిశోధనా పత్రాలను సమర్పిస్తున్నారు. ఉదాహరణకు, ‘రామాయణంలోని కిష్కింధ కాండ’ దౌత్యం, సార్వభౌమాధికారం, నైతికతకు ఒక అద్భుతమైన ఫ్రేమ్‌వర్క్ అని ఒక విద్యార్థి తన పరిశోధనలో పేర్కొన్నారు. రాముడు-సుగ్రీవుల మధ్య కుదిరిన మైత్రి కేవలం స్నేహం మాత్రమే కాదు, అది ఆధిపత్యం లేని భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన నాయకత్వానికి ప్రతీక అని విద్యార్థులు వివరిస్తున్నారు.

మహాభారతం - నేటి ప్రపంచానికి సరికొత్త పాఠాలు
మహాభారతంలోని శ్రీకృష్ణుడి నీతిని, ప్రస్తుత యుద్ధ తంత్రాలతో పోల్చి చూస్తున్నారు. ‘జస్ట్ వార్’ భావనను మహాభారత ఘట్టాలతో అనుసంధానిస్తూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ఉగ్రవాద సంస్థలు లేదా అరాచక శక్తులను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా పురాతన పర్యావరణ పరిరక్షణ పద్ధతుల ద్వారా ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను కూడా వారు చర్చిస్తున్నారు. ప్రపంచం అశాంతితో ఉన్న తరుణంలో, భారతీయ ఇతిహాసాల నుండి తీసుకున్న ఈ పరిష్కారాలు ప్రపంచ శాంతికి బాటలు వేస్తాయని నలంద విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది.

ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు

Advertisement
 
Advertisement
Advertisement