
ముంబై: మహానగరం ముంబై అంతటా 400 కిలోల ఆర్డీఎక్స్ మోసుకెళ్లే 34 మానవ బాంబులు అమర్చామంటూ రెండు రోజుల క్రితం వచ్చిన బెదిరింపు కాల్‌ను మరువకముందే ఇదే తరహాలో మరో బెదిరింపు కాల్ వచ్చింది. తాజాగా నగరంలోని నాయర్ ఆసుపత్రిలో బాంబు అమర్చినట్లు కాల్ రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిని పేల్చివేయడానికి రంగం సిద్ధం చేసినట్లు హెచ్చరిక కాల్ అందిందని, వెంటనే భద్రతా దళాలు అప్రతమ్తమై బాంబుకోసం గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసు అధికారులు తెలిపారు.
శనివారం రాత్రి 11 గంటలకు డీన్ అధికారిక చిరునామాకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు బాంబు గుర్తింపు, నిర్మూలన దళం (బీడీడీఎస్)తో కలిసి ఆస్పత్రి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొన్ని గంటలపాటు తనిఖీలు నిర్వహించాక ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. ముంబై అంతటా వాహనాలలో 400 కిలోల ఆర్డీఎక్స్ మానవ బాంబులు అమర్చామంటూ బెదిరింపు కాల్ వచ్చిన రెండు రోజులకు తాజా ఘటన జరిగింది. లష్కర్ ఎ-జిహాదీ’ సంస్థ నుండి ఈ బెదిరింపు కాల్ వచ్చింది.
మరోవైపు 10 రోజుల పాటు సాగిన గణేశ్ నవరాత్రుల ముగింపు సందర్భంగా మహారాష్ట్ర అంతటా, ముఖ్యంగా ముంబైలో పోలీసులు భద్రతను మరింతగా పెంచారు. నిమజ్జనం సందర్భంగా జనసమూహ నియంత్రణ, నిఘా కోసం 21 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇటీవలి కాలంలో ముంబైని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్స్, ఈ- మెయిల్స్ రావడం అధికమయ్యింది. సోమవారం కల్వా రైల్వే స్టేషన్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్ చేసిన 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.