సాక్షి, చైన్నె: కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి శుక్రవారం చేసిన ఓ ట్వీట్ తమిళనాడు కాంగ్రెస్(టీఎన్‌సీసీ)లో రచ్చకెక్కింది. ఎన్నికలలో సీట్ల కేటాయింపులో భారీ స్కాం జరిగినట్టుగా ఆమె కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీలో జరగాల్సిన ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే ప్రారంభం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఐదు చోట్ల మాత్రమే గెలిచింది. కూటమితో సీట్ల పందేరం అన్నది పెద్ద వివాదం నడుమే జరిగింది. డీఎంకే అధికారం కోల్పోవడంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే పక్షాన కాంగ్రెస్ చేరింది. ఈ కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు సైతం దక్కించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌పై ఎంపీ జ్యోతిమణి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. ఆమె ఎక్స్ పేజీలో అన్ని వివరాలను ప్రకటించారు.
కమిటీ ఏర్పాటుపై అభ్యంతరం..
టికెట్ల కేటాయింపుపై అసలు విచారణ జరపకుండా, కేవలం ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై మాత్రమే విచారించడానికి కమిటీని వేయడం అనేది తప్పు చేసిన వారిని కాపాడడానికి చేసిన ఏర్పాటు మాత్రమేనని ధ్వజమెత్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలోనే జరిగిందని, ఆ కమిటీపై ఉన్న ఆరోపణలను కాంగ్రెస్ నిబంధనల ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాత్రమే విచారించగలదన్నారు.
సర్వేల పేరిట భారీ అవినీతి
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని వివరించారు. ముందే కొందరు అభ్యర్థులను ఖరారు చేసి, ఆ తర్వాత వారికి అనుకూలమైన నియోజకవర్గాలను కూటమి నుంచి అడిగి తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సర్వేల పేరుతో పార్టీలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారిని, గెలిచే అవకాశం ఉన్న నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారని వివరించారు. కొత్తవారికి, అసలు గెలుపు అవకాశాలు లేని చాలామందికి సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక మంది పార్టీని వీడారని, ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చింది ఎవరు? దేని ఆధారంగా ఇచ్చారు? తప్పు చేసిన వారిపై తీసుకున్న చర్యలు ఏంటీ అని ప్రశ్నించారు.
పార్టీ సంస్కరణల కోసం పిలుపు
ఈ దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ నుంచి కాపాడాల్సిన చారిత్రక బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఎక్కడా రాజీ పడకుండా పోరాడుతున్నారని పేర్కొంటూ, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఇలాంటి తప్పులు క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఇలాంటి అభ్యర్థుల ఎంపికపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయని, చాలాచోట్ల ఇది పార్టీ ఓటమికి కూడా కారణమవుతోందన్నారు.
అయితే, విచారణ జరపడానికి బదులు తప్పు చేసిన వారిని కాపాడుతున్నారని మండిపడ్డారు. తమిళనాడు అభ్యర్థుల ఎంపికను తాను చాలా దగ్గర నుంచి చూశానని, ఇంత బహిరంగంగా తప్పులు జరగడం పార్టీ భవిష్యత్తుకు పెద్ద మైనస్ అవుతుందని హెచ్చరించారు. ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడి గెలవాలంటే జిల్లా, ప్రాంతీయ స్థాయి నాయకుల, కార్యకర్తల గళానికి విలువ ఇవ్వాలని సూచించారు. పార్టీ పారదర్శకంగా పనిచేయాలని, అందువల్ల కాంగ్రెస్‌లో అంతర్గత ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే మొదలవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు కూడా అభ్యర్థుల ఎంపికపై జోతిమణి తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. తాజాగా ఆమె తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడడం చర్చకు దారి తీసింది.


