
ఒళ్లంతా కొమ్ముల కవచం
కొన్ని ఏకంగా మీటర్ పొడవు!
చరిత్రలోనే అతి బలిష్టమైన జీవి
ఎకిలీస్. గ్రీకు రచయిత హోమర్ సృష్టించిన అజరామర ఇతిహాస ద్వయంలో మొదటిదైన ఇలియాడ్‌లో కథానాయకుడు. ప్రపంచ ఇతిహాస చరిత్రలోనే వీరత్వానికి తిరుగులేని ప్రతీకలనదగ్గ పాత్రల్లో సాటిలేనివాడు. గ్రీకు యోధులందరిలోనూ అగ్రగణ్యుడు. ‘ఎకలీస్ షీల్డ్’గా పిలిచే అతని దివ్య కవచం కూడా అంతటి ప్రసిద్ధమైనదే. కర్ణుని కవచాన్ని తలపించే ఆ షీల్డ్ కారణంగా ఎకిలీస్ జీవితపర్యంతమూ ఎవరి చేతుల్లోనూ ఓటమి కాదు కదా, కనీసం ఎదురన్నది కూడా ఎరగని మహావీరునిగా నిలిచాడు.
ఇదంతా క్రీస్తుపూర్వం 12వ శతాబ్దం, అంటే నేటికి సుమారు 3,200 ఏళ్ల క్రితం నాటి గాథ. అయితే అంతకు చాలాకాలం క్రితమే, సరిగ్గా చెప్పాలంటే ఏకంగా 16.5 కోట్ల ఏళ్లకు పూర్వమే ఎకిలీస్ షీల్డ్‌ను కూడా తలదన్నేంతటి సహచ కవచంతో రొమ్ము విరుచుకు సంచరించిన, సకల జీవజాలానికీ సింహస్వప్నమై నిలిచిన జీవి ఒకటుంది! అదే స్పైకోమెల్లస్ అనే రాక్షసబల్లి. బహుశా మానవాళికి ఇప్పటిదాకా తెలిసిన డైనోసార్లలోకెల్లా అత్యంత భీకరమైనది, బలిష్టమైనది, భయానకమైనది, అజేయమైనది అదేనంటే అతిశయోక్తి కాదు!!
‘కత్తుల’రత్తయ్య!
2,500 కి.మీ పై చిలుకు విస్తరించిన దట్టమైన అట్లాస్ పర్వత శ్రేణుల్లో నేటి మొరాకో తీరంలోని బులెమేన్ అనే చిన్నపాటి పట్టణ సమీపంలో 16.5 కోట్ల ఏళ్ల క్రితం ఈ స్పైకోమెల్లస్ సంచరించినట్టు సైంటిస్టులు బుధవారం వెల్లడించారు. అక్కడ దొరికిన శిలాజాలను లోతుగా పరిశీలించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. దీన్ని ఒకరకంగా ఆ కాలపు కత్తుల రత్తయ్య అని చెప్పొచ్చు. ఎందుకంటే ముళ్లపందిని తలపించే రీతిలో దాని ఒంటిపై పక్కటెముకల నిండా పొలుసులను తలపించే కొమ్ములే.
అయితే అవి సాదాసీదా కొమ్ములు కావు! అత్యంత పదునైన కత్తులు కూడా వాటిముందు దిగదుడుపే. కొన్నైతే ఏకంగా మీటర్ పొడవుతో, చూస్తేనే పై ప్రాణాలు పైకే పోయేలా ఉంటాయి! ‘‘కానీ మెడ, వీపు భాగంలో అంత పెద్ద కొమ్ములతో స్వీయరక్షణ ఎలా సాధ్యమన్నది అర్థం కాని విషయం’’అంటూ ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సకశేరుక శిలాజ శాస్త్రవేత్త సూజన్ మెయిడ్‌మెంట్ ఆశ్చర్యం వెలిబుచ్చారు.
‘‘ఇప్పటిదాకా మనకు తెలిసిన సకల జీవజాతుల్లోనూ ఇంతటి విచిత్ర, బలిష్ట ప్రాణి మరోటి లేదు’’అని ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన శిలాజ శాస్త్రవేత్త, అధ్యయన సహ సారథి రిచర్డ్ బట్లర్ విస్మయం వ్యక్తం చేశారు. దీని వివరాలను నేచర్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు.
శాకాహార ‘రాకాసి’!
⇒ 13 అడుగుల పొడవు, దాదాపు 2,000 కిలోల బరువైన శరీరం స్పైకోమెల్లస్ సొంతం.
⇒ యాంకిలోసార్స్‌గా పిలిచే కవచ రాక్షసబల్లుల్లో అత్యంతపురాతన జీవి ఇదేనట.
⇒ ఇంతా చేస్తే ఇది పక్కా శాకాహారి! భారంగా అడుగులేసేదట.
⇒ మాంసాహార డైనోసార్ల బారినుంచి కాపాడుకోవడంతో పాటు ఆడ డైనోసార్లను ఆకర్షించేందుకు కూడా ఈ పొలుసులు వాటికి బ్రహ్మాండంగా పనికొచ్చేవట.
⇒ జత కోసం స్పైకోమెల్లస్‌ల నడుమ పోటీలో గెలుపోటములు దాదాపుగా ఈ కొమ్ముల తాలూకు బలం మీదే ఆధారపడేవట.
⇒ మెడ నుంచి మొదలై వీపు పొడవునా ఒకదాని పక్కన ఒకటిగా వ్యాపించిన అనేక వెన్నెముకలు దీని ప్రత్యేకత!
⇒ దీని తోక భాగంలో ఉండే పొడవైన కొమ్ము వెనక నుంచి వచ్చే శత్రువులను కాచుకునేదట.
⇒ స్పైకోమెల్లస్‌లు యాంకిలోసార్స్ కుటుంబానికి చెందిన డైనోసార్లు. వీటికి తోక భాగంలో కొమ్ములు పుట్టుకొచ్చింది ఇప్పటిదాకా భావిస్తున్న దానికంటే 3 కోట్ల ఏళ్లముందేనని స్పైకోమెల్లస్ శిలాజాన్ని పరీక్షించిన మీదట సైంటిస్టులు తేల్చారు.
⇒ స్టేగోసార్స్ అనే మరో శాకాహార డైనోసార్లకు యాంకిలోసార్స్ సమకాలీకులు. అంటే జురాసిక్ యుగం నాటివి.
⇒ అవి అంతరించాక కూడా ఇవి చాలాకాలం పాటు మనుగడ సాగించాయి.
⇒ 6.6 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఢీకొన్న గ్రహశకలం దెబ్బకు డైనోసార్ల యుగంతో పాటు యాంకిలోసార్స్ కూడా సమూలంగా అంతరించిపోయాయి.
⇒ యాంకిలోసార్స్ కుటుంబంలోకెల్లా ఇప్పటి దాకా తెలిసిన అతి పెద్ద స్పైకోమెల్లస్ ఏకంగా 8 మీటర్ల పొడవున్నట్టు తేలింది! అది నేటి ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంతంలో సంచరించినట్టు అక్కడ దొరికిన శిలాజాన్ని బట్టి నిర్ధారణ అయింది.
⇒ 2021లో స్పైకోమెల్లస్ తాలూకు పక్కటెముక భాగపు శిలాజం దొరికింది. 2023లో దొరికిన ప్రస్తుత శిలాజంలో పూర్తి అస్థిపంజరం లేదు. ముఖ్యంగా తల భాగం మిస్సయింది. అయినా దీనికి సంబంధించి చాలా వివరాలు, విశేషాలను అది బయట పెట్టిందంటూ సైంటిస్టులు సంబరపడుతున్నారు.