
సెంట్రల్ చైనాలో గుర్తించిన పరిశోధకులు
బీజింగ్: భూగోళంపై ఒకప్పుడు భారీ డైనోసార్లు(రాక్షస బల్లులు) ఉండేవన్న సంగతి తెలిసిందే. వాటిపై ఇప్పటికీ అధ్యయనం జరుగుతూనే ఉంది. భూమిని గ్రహ శకలాలు ఢీకొట్టడం లేదా వాతావరణ మార్పుల వల్ల లక్షల సంవత్సరాల క్రితం ఇవి అంతరించిపోయాయని సైంటిస్టులు చెబుతుంటారు. కానీ, చైనాలో 85 మిలియన్ల (8.5 కోట్లు) ఏళ్ల క్రితం నాటి రాక్షస బల్లుల గుడ్లను పరిశోధకులు వెలికితీశారు. అంటే డైనోసార్ల చరిత్ర మనం ఊహించిదానికంటే పురాతనమైనదని స్పష్టమవుతోంది.
సెంట్రల్ చైనాలోని యూన్‌యాంగ్ బేసిన్‌లో ఉన్న ఖింగ్‌లాంగ్‌షాన్‌లో తవ్వకాల్లో రాక్షస బల్లుల గుడ్లు లభించాయి. ఇవి ఏ కాలానికి సంబంధించినవో తెలుసుకోవడానికి ఆధునిక కార్పొనేట్ యురేనియం–లెడ్(యూ–పీబీ) డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ గుడ్లు 8.5 కోట్ల ఏళ్ల నుంచే ఇక్కడ ఉన్నట్లు తేల్చారు.
ఆ కాలాన్ని క్రెటాసియస్ పీరియడ్ అంటారు. ఆ సమయంలోనే భూమిపై భారీగా వాతావరణ మార్పులు సంభవించాయి. అత్యంత వేడిగా ఉన్న వాతావరణం చల్లబడడం మొదలైంది. ఈ పరిణామమే డైనోసార్లు క్రమంగా అంతరించిపోవడానికి దోహదపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. డైనోసార్ ఎగ్స్ విషయంలో కార్పొనేట్ యురేనియం–లెడ్ డేటింగ్ పరీక్ష చేయడం ఇదే మొదటిసారి. ఈ వివరాలను ఎర్త్ సైన్స్ పత్రికలో ప్రచురించారు.