శేషాచలం అడవుల్లో కొత్త బల్లి జాతిని గుర్తించిన జెడ్‌ఎస్‌ఐ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పవిత్ర తిరుమల పర్వతశ్రేణుల్లో హెమిఫిల్లో డాక్టిలస్ జాతికి చెందిన కొత్త బల్లి జాతిని హైదరాబాద్‌కు చెందిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 881 మీటర్ల ఎత్తులో ఓ గంధపు తోటలోని చెట్టు బెరడు కింద ఈ కొత్త జాతికి చెందిన బల్లిని గుర్తించారు. కేవలం 3.37 సెంటీమీటర్ల పొడవున్న ఈ జాతి బల్లికి హెమిఫిల్లో డాక్టిలస్ వెంకటాద్రి అని పేరుపెట్టారు.
కొత్త బల్లి జాతి పరిశోధనలో భరత్ భూపతి, సుమిద్ రే, బి. లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం. కరుతపాండి, డాక్టర్ దీపా జైస్వాల్, డాక్టర్ నీలాద్రి బి.కర్, డాక్టర్ ప్రత్యూష్ పి. మొహాపాత్రలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పాలుపంచుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ జర్నల్ ‘హెర్పెటోజోవా’ప్రచురించింది. కొత్తగా కనుగొన్న బల్లి ఏపీ నుంచి గుర్తించిన హెమిఫిల్లో డాక్టిలస్ జాతికి చెందిన రెండో జాతి. మొదటిది హెచ్. అరకుయోన్సిస్. దీని జన్యు వైవిధ్యం భిన్నంగా ఉందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఈ సందర్భంగా భారత జంతు ప్రదర్శన శాల డైరెక్టర్ డాక్టర్ ధృతి బెనర్జీ పరిశోధన బృందాన్ని అభినందించారు.


