
అనూహ్యం.. అసాధారణం.. ఆశ్చర్యం.. నైరుతి రుతుపవనాలు ‘సంప్రదాయ’ గతి తప్పాయి. వాతావరణ మార్పు, భూతాపం నేపథ్యంలో అవి దారి తప్పి ఆధునిక ‘పోకడ’ పోతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నడక కొద్దిగా మారింది. భవిష్యత్తులో ఇదే నడత కొనసాగితే మన దేశానికి ముప్పు తప్పదు!!.
ఈ నెల తొలి వారంలో భారత వాతావరణ విభాగానికి చెందిన ఓ ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం రుతుపవన గమనంపై వాతావరణ నిపుణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల వరకు వెళ్లి.. గోడకు కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన రుతుపవనాలు కొంత కట్టు తప్పి టిబెట్ పీఠభూమి ప్రాంతంలోకి ప్రవేశించాయి.
హిమాలయాలకు ఆవల ఉండే టిబెట్ పీఠభూమిలో అవపాతం తక్కువ. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ పొడిగా కనిపిస్తుంది. శీతాకాలంలో హిమపాతం, వసంత రుతువులో పశ్చిమ అలజడుల వల్ల కొద్దిపాటి వర్షపాతం మాత్రమే అక్కడ నమోదవుతాయి. అలాంటి శుష్క టిబెట్ ప్రాంతంలో నైరుతి తేమ గాలులు తాజాగా వానలు కురిపించాయి. నైరుతి రుతుపవనాల తేమగాలులు హిమాలయాల హద్దును దాటేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ మీదుగా టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపుతోందని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన గ్లేసియాలజిస్ట్ మనీష్ మెహతా చెప్పారు.
ఇండియాకు ప్రత్యేక వరం.. రుతుపవనాలు!
వేసవిలో సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బయలుదేరే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో భారతదేశమంతటా విస్తరించి జూన్-సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిపిస్తాయి. వాటి ప్రయాణం ఉత్తరానికి వచ్చేటప్పటికి ఎదురుగా హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా, పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి.
ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తాయి. తమలో మిగిలివుండే తేమతో హిమాలయ పర్వత శ్రేణుల నుంచి అవి వెనక్కు మరలుతాయి. తిరుగుపయనంలో ఈశాన్య రుతుపవనాల పేరిట అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షిస్తూ మళ్లీ సముద్రం బాట పడతాయి. ప్రయాణంలో వర్షిస్తూ తేమను కోల్పోతూ ఉంటాయి కనుక... నైరుతితో పోలిస్తే మనకు ఈశాన్య రుతుపవనాల వర్షపాతం తక్కువ.
రుతుపవన ప్రక్రియ భారతదేశానికి ప్రత్యేకం. దేశంలో సాగునీరు, తాగునీటికి రుతుపవనాలే ఆధారం. భూతాపం, వాతావరణ మార్పు, పశ్చిమ అలజడులు/కల్లోలాలుగా పిలిచే వాతావరణ ప్రక్రియల వల్ల నైరుతి రుతుపవనాలు టిబెట్ వైపు వెళ్లి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఎత్తు తక్కువ ఉండే దారుల గుండా నైరుతి తేమ గాలులు టిబెట్లోకి ప్రవేశించి ఉండొచ్చని అంటున్నారు. అయితే..
నైరుతి రుతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం ఆరంభిస్తే... హిమనీనదాల (గ్లేసియర్స్)లోని మంచు కరుగుదలలో, నదీ ప్రవాహాల తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. నైరుతి కాస్తా తుర్రుమని టిబెట్ పారిపోతే మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారతదేశంలో వర్షపాతం తగ్గుతుంది. వ్యవసాయం, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. తాగునీటికి కటకట తప్పదు.
రుతుపవనాలనే నమ్ముకుని బతుకుతున్న దేశం మనది. ఏదో ఒక సీజన్లో రుతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు రైతన్నలు. నైరుతి రుతుపవనాలు భౌగోళికంగా ‘హిమాలయ కంచె’ దూకి ప్రతి సీజన్లోనూ ఆవలి టిబెట్ వైపునకు పూర్తిగా మరలిపోయేట్టయితే... అవి ఇక తిరిగి వెనక్కు రావు! అప్పుడిక ఈశాన్య రుతుపవనాలు అనేవే ఉండవు!! ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా ఆ తేమలేని, బలహీన పవనాలతో కురిసే వర్షాలు, కలిగే ప్రయోజనం నామమాత్రమే. భయపెట్టాలని కాదు గానీ... ఆ దుస్థితి రాకూడదనే ఆశిద్దాం. వాతావరణ మార్పు ప్రభావంతో ఎన్నో వింతలు చూస్తున్నాం. నిరుడు కురిసిన వర్షాలకు సహారా ఎడారి ఇసుక తిన్నెలు సరస్సులను తలపించిన సంగతి మరచిపోతే ఎలా?!
(Source: Zee News)
::జమ్ముల శ్రీకాంత్