ఐఎండీ అంచనా
న్యూఢిల్లీ: నవంబర్ నెలలో మొత్తమ్మీద దేశవ్యాప్తంగా చలి ఎక్కువగానే ఉండే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. వాయవ్య, మధ్య, పశి్చమ భారతం సహా చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వాయవ్యంలోని కొన్ని ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాలలో కనిçష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శుక్రవారం జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. భూమధ్యరేఖ, పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న బలహీనమైన లా నినా పరిస్థితులే ఇందుకు దోహద పడుతున్నాయని మహాపాత్ర వివరించారు. లా నినా పరిస్థితులు 2025 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో, నవంబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణాదిన సాధారణం కంటే తక్కువగానే వర్షాలుంటాయన్నారు.


