మోదీజీ అమెరికా రండి.. మార్కో రూబియో ఆహ్వానం | Marco Rubio invites Modi to US | Sakshi
Sakshi News home page

మోదీజీ అమెరికా రండి.. మార్కో రూబియో ఆహ్వానం

May 23 2026 6:36 PM | Updated on May 23 2026 6:40 PM

Marco Rubio invites Modi to US

ఢిల్లీ: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు గంటకుపైగా చర్చలు సాగాయి. ఈ సందర్భంగా మార్కో రూబియో మోదీని అమెరికా ప్రర్యటనకు రావాలని ఆహ్వానించారు. యుఎస్‌ఏ అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి మేరకే ఈ ఆహ్వానం అందించినట్లు రూబియో పేర్కొన్నారు.

మోదీతో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై ఇరు నేతలు చర్చలు జరిపారు. సంక్షోభ పరిష్కారానికి దౌత్య చర్చలే ప్రధానమార్గామని మోదీ సూచించారు. అనంతరం ప్రధాని మోదీ, రూబియోతో తన సమావేశానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను పోస్ట్ చేశారు. 

కాగా మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం  భారత్‌కు వచ్చారు. ఆయన విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. భారత్‌–పాక్‌ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్‌ పదేపదే ప్రకటించుకోవడం, భారీ టారిఫ్‌లు, హెచ్‌1బీ వీసాల కట్టడి చర్యలు తదితరాల కారణంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిన పెట్టడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు.

విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై అనేక అంశాలపై చర్చలు జరుపుతారు. మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొంటారు. రూబియో పర్యటన సందర్భంగా కోల్‌కతా, జైపూర్, ఆగ్రాలను కూడా సందర్శించే అవకాశముందని సమాచారం. ‘భారత్‌తో మాకు చాలా పనుంది. భారత్‌ మాకు మంచి మిత్ర దేశం, భాగస్వామి కూడా. నాది చాలా ముఖ్యమైన ట్రిప్‌’అంటూ భారత్‌ పర్యటనపై శుక్రవారం రూబియో వ్యాఖ్యానించడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement