పశ్చిమాసియా సంక్షోభం.. మామిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌ | Mango price decline India due to west asia war | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా సంక్షోభం.. మామిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌

Apr 14 2026 3:02 PM | Updated on Apr 14 2026 3:13 PM

Mango price decline India due to west asia war

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందనేది తాతల కాలం నాటి సామెత... కానీ ప్రపంచం ఒక  కుగ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అది అక్షర సత్యం కూడా. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న సాంకేతిక యుగంలో యుద్ధం లాంటి పరిస్థితులు మరింత ప్రభావాన్ని చూపిస్తాయని ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం నిరూపిస్తోంది. నెలలుగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంక్షోభం ఓ వైపు గ్యాస్‌ పెట్రోల్‌ వంటి అత్యవసరాలకు ఇబ్బందులు సృష్టిస్తుంటే మరోవైపు మామిడి పండ్ల ప్రియులకు తీపి కబురు తెస్తోంది.

పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా ఏటా ఆకాశంలో చక్కర్లు కొట్టే మామిడి పండ్ల  ధరలు ఈ సీజన్‌లో నేల చూపులు చూడనున్నాయి. దీనికి కారణం యుద్ధం నేపధ్యంలో విదేశాలకు ఎగుమతులు గణనీయంగా తగ్గడం. ప్రస్తుతం జనాదరణ పొందిన బెనిషాన్‌ రకం మామిడి పండు కిలోకు రూ. 150–200 మధ్య అమ్ముడవుతోంది. అలాగే తీపి, రసభరితమైన రుచికి ప్రసిద్ధి చెందిన రసాలు హైదరాబాద్‌లో కిలోకు రూ. 100–150కి లభిస్తున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే సీజన్‌ ప్రారంభం కాబట్టి అంతగా తెలియకున్నా రాబోయే రోజుల్లో  మామిడి ధరలు బాగా తగ్గే అవకాశం ఉందని పండ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ప్రతి సంవత్సరం, తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు మామిడి పండ్లు భారీగానే ఎగుమతి అవుతాయి. మరీ ముఖ్యంగా యూఏఈ, యూఎస్‌  కెనడాలకు మన దగ్గర నుంచి మామిడి పండ్ల ఎగుమతి ఎక్కువ.  సగటున ప్రతి సంవత్సరం, భారతదేశం సుమారు 30 వేల మెట్రిక్‌ టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది,  వాటిలో అత్యధిక వాటా అంటే దాదాపుగా 10 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ఒక్క యూఏఈకి వెళుతుంది.

అయితే ఎడతెగని యుద్ధం, తద్వారా యుఏఈలో  ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల కారణంగా, మామిడి ఎగుమతులకుు డిమాండ్‌ తగ్గింది. అందుబాటులో ఉన్న ఒక నివేదిక ప్రకారం, ఇప్పటికే మామిడి ఎగుమతులు 20–30 శాతం తగ్గుదలను నమోదు చేస్తున్నాయి.  ఆ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితితో పాటు బాగా పెరిగిన  ఎగుమతి వ్యయం కూడా దీనికి దోహదం చేస్తోంది. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల యూఎస్‌  కెనడా వంటి ఇతర గమ్యస్థానాలకు ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి.

ఏతావాతా ఇది భారతీయ నగరాల్లో  మామిడి ధరలు తగ్గడానికి దారితీయవచ్చునని అంచనా. దేశీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ, అత్యుత్తమ నాణ్యత గల కొన్ని రకాల ఖరీదైన పండ్ల విక్రయాలకు ఎగుమతులే ఆధారం వాటి ఎగుమతులు పడిపోయినప్పటికీ వాటికి స్థానికంగా కొనుగోలుదారులు దొరుకుతారో లేదోనని కూడా ఎగుమతిదారులు సందేహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎగుమతిదారులు ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి రావాలని ఎదురుచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement