సోషల్ మీడియా రీల్స్ స్టంటా లేక ఎండవేడిని తట్టుకోవడానికి చేసిన ప్రయత్నమో గానీ ఒక యువకుడికి చుక్కలు కనిపించాయి. ఎరక్క బోయి చేసిన ఒక్క పనితో దాదాపు ప్రాణం పోయినంత పనైంది. గంటల తరబడి నరక యాతన అనుభవించాడు. అల్వార్ జిల్లా అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధోగఢ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అంటేనే మండించే ఎండలు. 40 డిగ్రీల ఎండ వేడిమి నుండి తప్పించుకోవడానికి కాలూరామ్ అనే యువకుడు పాల డబ్బాను తలపై రక్షణగా పెట్టుకున్నాడు. 15 లీటర్ల పాల డబ్బాను తలపై హెల్మెట్‌లా పెట్టుకున్నాడు. కానీ, అనూహ్యంగా ఆ అల్యూమినియం పాల క్యాన్‌లో తల ఇరుక్కు పోయింది. ఎంతకూ బయటకు రాలేదు. ఈ వీడియోలో తలకు పాల డబ్బా ఇరుక్కుపోయి ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.
ఎంతో కష్టపడి కాపాడారు
కొందరు ఇది ఎండ వేడిని తట్టుకోవడానికి చేసిన 'నింజా టెక్నిక్' అంటుండగా, మరికొందరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసమే ఇలా చేశాడని అంటున్నారు. కారణం ఏదైనా, ఎంత ప్రయత్నించినా డబ్బా రాకపోవడంతో కాలూరామ్ ఆందోళనతో కేకలు వేశాడు. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. దాన్ని తీయడానికి నానా కష్టాలుపడ్డారు. అయినా రాలేదు. చివరికి గ్రైండర్‌తో కట్ చేసి అతడికి విముక్తి కల్పించారు. ఎంతో శ్రమ, చాకచక్యం తర్వాత, బాధితుడికి ఎలాంటి గాయం కాకుండా, ఆ డబ్బాను తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత!
A man’s head got stuck in milk can! Don’t know why he put his head there!? pic.twitter.com/oOlTKcOTfS
— Aparajite (@amshilparaghu) April 25, 2026
నెటిజన్ల స్పందన
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో , నెటిజన్ల మీమ్స్ వెల్లువెత్తాయి. "ఇతనే మన ఇండియన్ ఐరన్ మ్యాన్" అని ఒకరు చమత్కరించారు. రీల్స్ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వేడికి ఆ డబ్బా కొలిమిలా మారకపోవడం మంచిదైంది అని ఒకరు, వేడి నుండి తప్పించుకోవాలనుకుంటే,చుట్టూ ఒక టవల్ చుట్టుకోవాలి గానీ, ఈ పాల డబ్బా ఏంటి బ్రో అని మరొకరు కామెంట్ చేశారు.
నోట్: ఈ వీడియో చూడటానికి హాస్యంగా అనిపించినప్పటికీ, ఇదొక తీవ్ర హెచ్చరిక. సోషల్ మీడియాను ఆకర్షించేందుకు ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పకనే చెప్పింది. ఇలాంటి విన్యాసాలు చేసేముందు ఒకటిరి రెండు సార్లు ఆలోచించు కోవాల్సిందే.
ఇదీ చదవండి: శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరిక


